పిఠాపురం : పిఠాపురం నియోజకవర్గం చిత్రాడ వద్ద మార్చి 14వ తేదీన నిర్వహించనున్న జనసేన ఆవిర్భావ సభ ప్రాంగణాన్ని పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ మంగళవారం సాయంత్రం పరిశీలించారు. సభా స్థలిలో ఏర్పాటు చేస్తున్న లైటింగ్, సౌండ్ కి సంబంధించి చర్చించారు. సంబంధిత బాధ్యతలు చూస్తున్నవారితో చర్చించారు. అదే విధంగా వేదిక నిర్మాణాన్ని పరిశీలించారు. పార్టీ కార్యక్రమాల నిర్వహణ కమిటీ ఛైర్మన్ కళ్యాణం శివ శ్రీనివాస్ కి సూచనలు చేశారు. ఈ పరిశీలనలో రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్, శాసన మండలిలో ప్రభుత్వ విప్ పిడుగు హరిప్రసాద్, కాకినాడ ఎంపీ తంగెళ్ళ ఉదయ్ శ్రీనివాస్, శాసన సభలో ప్రభుత్వ విప్ లు బొలిశెట్టి శ్రీనివాస్, అరవ శ్రీధర్ పాల్గొన్నారు.
- సభా ప్రాంగణంలో ఆతిధ్య సమన్వయంపై దృష్టి
ఆవిర్భావ సభకు హాజరయ్యే అతిధులను సమన్వయపరచడంపై చర్చించారు. ప్రాంగణంలో ఉండే అతిధులతోపాటు, సాంకేతిక, మెడికల్ బృందాలను, అధికారులు, కళాకారులు, సమన్వయం చేసుకొంటూ వారికి అవసరమైన ఏర్పాట్లను చూసే బాధ్యతను పార్టీ రాష్ట్ర కార్యదర్శి సంగిశెట్టి అశోక్ కు అప్పగించారు. సభ నిర్వహణ కోసం ఏర్పాటు చేసిన సమన్వయ కమిటీతో కలసి ఆయన పని చేస్తారు.