- దేశంలోనే అత్యుత్తమంగా నిర్మాణాలు చేపట్టాలని మంత్రి లోకేష్ ఆదేశం
- సమీక్ష సమావేశంలో పాల్గొన్న ఎ.పి.ఎమ్.ఎస్.ఐ.డి.సి చైర్మన్ చిల్లపల్లి శ్రీనివాసరావు మరియు అధికారులు
అమరావతి : మంగళగిరి సమీపంలోని చినకాకాని వద్ద ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన వంద పడకల ఆసుపత్రి కార్పొరేట్ హాస్పటల్ కు ధీటుగా అత్యాధునిక సౌకర్యాలతో నిర్మించాలని రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ అధికారులను ఆదేశించారు. మంగళగిరిలో వంద పడకల ఆసుపత్రి నిర్మాణంపై ఎ.పి.ఎమ్.ఎస్.ఐ.డి.సి చైర్మన్ చిల్లపల్లి శ్రీనివాసరావుతో మరియు అధికారులతో మంత్రి లోకేష్ సమీక్షించారు. ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ శంకుస్థాపన రోజు నుండి ఏడాదిలోగా పనులు పూర్తయ్యేలా లక్ష్యం పెట్టుకొని పక్కా ప్రణాళికతో పనులు చేపట్టాలన్నారు. మంగళగిరి హాస్పటల్ నిర్మాణం దేశంలోనే అత్యుత్తమంగా ఉండేలా చేపట్టాలని సూచించారు. మంగళగిరి నియోజకవర్గ నలుమూలల నుంచి హాస్పటల్ కు వచ్చే పేషెంట్లు, వారి బంధువులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా సీటింగ్ ఏర్పాటు చేయాలన్నారు. అత్యవసర రోగులకు అవసరమైన లిఫ్ట్ సదుపాయం, విశాలమైన వాహనాల పార్కింగ్ ఉండాలని సూచించారు. గ్రౌండ్ ఫ్లోర్, ఫస్ట్ ప్లోర్ కలిపి 1,14,075 చదరపు అడుగుల్లో విశాలంగా ఈ హాస్పటల్ నిర్మాణం చేపట్టనున్నట్లు తెలిపారు. జాతీయస్థాయిలో పేరెన్నికగన్న ఆసుపత్రుల తరహాలో నిర్మాణాలు చేపట్టాలి. ఆసుపత్రిలో వైద్య సేవలు పొందేందుకు ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా చూడాలన్నారు. డాక్టర్లు, పేషంట్లు, విజిటర్స్ కు సౌకర్యవంతంగా ఉండేలా జోన్లు ఉండాలని అధికారులకు సూచించారు. ఈ సందర్భంగా ఎ.పి.ఎమ్.ఎస్.ఐ.డి.సి చైర్మన్ చిల్లపల్లి శ్రీనివాసరావు మాట్లాడుతూ భారతదేశంలో ఉన్న ప్రభుత్వ ఆస్పత్రులు పరిశీలించి అత్యుత్తమ ఆస్పత్రి నమూనా మౌలిక సదుపాయాలు పరిశీలించి ఇక్కడ ఏర్పాటు చేయాలని నారా లోకేష్ తెలిపారు. వీలైనంత త్వరగా శంకుస్థాపన కార్యక్రమానికి ఏర్పాటు చేయాలని లోకేష్ ఆదేశించారు. శంకుస్థాపన చేసిన తర్వాత వీలైనంత త్వరగా పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని నారా లోకేష్ సూచించారు. పేద ప్రజలకు ఎంతగానో ఈ ఆస్పత్రి ఉపయోగపడుతుంది అని తెలిపారు. ఈ సమావేశంలో ఏపీఎమ్ఎస్ఐడీసీ (ఆంధ్రప్రదేశ్ వైద్య విద్య, మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ) చైర్మన్ చిల్లపల్లి శ్రీనివాసరావు, సీఈ జి.సుధాకర్ రెడ్డి, ఎస్ఈ వి.చిట్టిబాబు, ఈఈ సీవీ రమణ, భార్గవ్ గ్రూప్ అధినేత భార్గవ్, భార్గవ్ గ్రూప్ చీఫ్ ఆర్చిటెక్చర్ నిఖిల, ఏపీఎమ్ఎస్ఐడీసీ డీఈఈ ఎమ్.హనుమంతరావు నాయక్, ఏఈ జి.గోపీచంద్, ఏఈ కె.శివ సత్యనారాయణ, భార్గవ్ గ్రూప్ డీజీఎమ్ ఏ.శ్యామ్ కిషోర్, సీనియర్ ఇంజనీర్ డి.అనిల్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.