సూర్యాపేట: గ్రామీణ వ్యవసాయ కార్మికులకు, పేదలకు కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్ లో ప్రవేశపెట్టినరూ.50,65,345 కోట్ల బడ్జెట్ కేటాయింపులలో తీవ్ర అన్యాయం జరిగిందని ఇది ముమ్మాటికి ప్రజా వ్యతిరేక బడ్జెట్ అని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి మట్టిపల్లి సైదులు అన్నారు. ఎన్నో సంవత్సరాలుగా వ్యవసాయ కార్మికులకు సమగ్ర శాసన చట్టం పార్లమెంట్ లో తీసుకురావాలని కోరుతున్న ఆ డిమాండ్ ను బడ్జెట్ లో ప్రస్తావన లేదన్నారు. గ్రామీణ వ్యవసాయ కార్మికులలు ఆధారపడిన ఉపాధి హామీ పథకానికి నిధులు కేటాయింపులలో మొండి చేయి చూపారని అన్నారు. ఉపాధి హామీని పట్టణ ప్రాంతాలకు విస్తరించడం కోసం బడ్జెట్ లో కనీసం ప్రస్తావన లేదన్నారు. ఉపాధి హామీలు పనిచేస్తున్న గ్రామీణ పేదలకు 100 రోజుల నుండి 200 రోజులకు ఉపాధి హామీ పనులు పెంచాలని, రోజు కూలి 600 ఇవ్వడం కోసం అదనపు నిధులు పెంచాలని డిమాండ్ ను బడ్జెట్ లో ప్రతిపాదనలు లేకపోవడం దురదృష్టకరమన్నారు. దేశంలో 22 కోట్ల మంది వ్యవసాయ కార్మికులు ఉన్నారని వారిని ఆదుకునేందుకు బడ్జెట్ లో నిధులు పెంచాల్సిన ప్రభుత్వం ప్రతి ఏటా నిధులను తగ్గిస్తుందన్నారు.బడ్జెట్ లో కార్పోరేట్ శక్తులకు రాయితీలు ప్రతిపాదించారని అన్నారు. పేదలకు ఇచ్చే సబ్సిడీలకు ప్రాధాన్యత ఇవ్వలేదన్నారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన కు నిధులు పెంచలేదన్నారు. సంవత్సరానికి రెండు కోట్ల ఇండ్లను ఇస్తామని చెప్పిన హామీ నీటి మూటలుగా మారాయి అన్నారు. ప్రైవేటు విద్యా ,ఉపాధి రంగాల్లో రాజ్యాంగబద్ధ రిజర్వేషన్లు అమలు చేయకుండా సామాజిక అసమానతలను, ఆర్థిక అసమానతలను ఏ విధంగా తగ్గించడానికి అవకాశం ఉందో దేశ ప్రజలకు వివరణ ఇవ్వాలని కోరారు.