కాకినాడ : తిరుమల తిరుపతి కొండమీదకు వెళ్లే అలిపిరి కాలిబాట మార్గానికి కంచె నిర్మాణం ఏర్పాటు చేయించాలని కాకినాడ భోగి గణపతి పీఠం ప్రభుత్వానికి టిటిడి బోర్డుకు లేఖ వ్రాసింది. వన్యమృగాల బెడద పేరిట కాలిబాట మార్గాన్ని నామ మాత్రం చేసి ఏడుకొండల మీద పాదయాత్రకు అవకాశం లేకుండా మూసివేయడం తగదన్నారు. కేరళ రాష్ట్రంలో ట్రావెన్ కోర్ బోర్డు ఆధ్వర్యాన అయిదు కొండల శబరిమల కొండ మీద అయ్యప్ప స్వాముల నడక మార్గానికి నిర్మించిన షెల్టర్లు రెండు వైపులా ఇనుప కంచె ఏర్పాటు చేసిన రీతిగా అలిపిరి మార్గంలో నిర్మాణాలు చేయా లన్నారు. కేంద్ర వన్య మృగ సంరక్షణ చట్టం ప్రకారం కేరళలో అనుసరించిన విధానాలను ఇక్కడ కూడా అమలు చేయాలన్నారు. వన్య మృగ సంరక్షణ చట్టం ప్రకారం అడవులలో వన్య మృగాలు జంతువులు సంచరించే మార్గాలకు అడ్డు గోడలు లేకుండా వుండాలన్ననియమం మేరకు కాలిబాట మార్గంలో ఫుట్ పాత్ వంతెనలు దిగువ మార్గాలు ఏర్పాటు చేసి శబరిమలలో అయిదు కొండల పొడవునా భక్తులకు సంరక్షణ చర్యలు అమలు జరుగుతున్నాయన్నారు. తిరుమల కొండ మీదకు ఆధునికంగా రోడ్ రైలు రోప్ మార్గ ప్రణాళికలకు ఎటువంటి ఆసక్తి చూపిస్తున్నారో అంతకంటే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి పురాతన సంప్రదాయ మైన అలిపిరి కాలిబాట మార్గాన్ని పూర్తి స్థాయి లో పునరుద్దరణ చేయించే ఏర్పాట్లు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. అలిపిరి కాలిబాట పొడవునా స్లాబు నిర్మాణాలు వున్నందున రెండు వైపులా ఇనుప కంచె నిర్మాణం సి సి కెమేరాల ఏర్పాటు డ్రోన్ కెమెరాల పర్యవేక్షణ నిరంతర గోవింద నామంతో సౌండ్ సిస్టం మైక్ నిర్వహణ కరెంటు బ్రేక్ లేకుండా పూర్తి స్థాయి లో ఫ్లడ్ లైట్ల వెలుతురు కొండ మీద ఆహార వ్యర్థాలను కొండ క్రిందకు నిత్యం తరలించే చర్యలు వహిస్తే పాదయాత్ర భక్తులకు అత్యంత భద్రత ఏర్పడుతుంద న్నారు. పగలు రాత్రి శ్రీవారి దర్శనానికి అలిపిరి కాలిబాట మార్గాన్ని బ్రేక్ లేకుండా నిర్వహించే పటిష్ట ఏర్పాటు చేయాలని కోరారు. సనాతనమైన దర్శన భాగ్యాన్ని ప్రజలకు దూరం చేయకుండా రాష్ట్ర ప్రభుత్వం టిటిడి బోర్డు 54వ ధర్మకర్తల మండలి తగిన చర్యలకు పూనుకోవాలని గణపతి పీఠం ఉపాసకులు తిరుమల పాదయాత్రికుడు దూసర్లపూడి రమణ రాజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు టిటిడి చైర్మన్ బి అర్ నాయుడులకు పంపించిన వినతిపత్రాల్లో కోరారు.