పార్టీ ప్రజా ప్రతినిధులు, నాయకులతో కలసి భూమి పూజ చేసిన పార్టీ పీఏసీ ఛైర్మన్, రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్
పిఠాపురం : పిఠాపురం నియోజకవర్గం చిత్రాడ వేదికగా ఈ నెల 14వ తేదీన నిర్వహించనున్న జనసేన పార్టీ ఆవిర్భావ సభకు సన్నాహాలు మొదలయ్యాయి. సభా ప్రాంగణం వద్ద వేదిక నిర్మాణం పనులను పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్, రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ శనివారం సాయంత్రం భూమి పూజ చేసి ప్రారంభించారు. పార్టీ శాసన సభ్యులు, పార్లమెంటు సభ్యుడు, ఎమ్మెల్సీ, రాష్ట్ర కార్యవర్గం, ఆవిర్భావ సభ నిర్వహణ కమిటీ సభ్యులతో కలసి పనులకు శ్రీకారం చుట్టారు. వేద పండితుల మంత్రోచ్ఛరణల మధ్య భూమి పూజా కార్యక్రమం శాస్త్రోక్తంగా నిర్వహించారు. సార్వత్రిక ఎన్నికల్లో ఘన విజయం తర్వాత నిర్వహిస్తోన్న తొలి ఆవిర్భావ సభ కావడంతో పార్టీ ప్రతిష్టాత్మకంగా ముందుకు తీసుకువెళ్తుంది. న భూతో న భవిష్యత్ అనే విధంగా ఏర్పాట్లు చేయాలని నాయకులకు మనోహర్ సూచించారు. భూమి పూజకు ముందు సభా ప్రాంగణం అంతా కలియ తిరిగి ఏర్పాట్లను పరిశీలించారు. కార్యక్రమాల నిర్వహణ విభాగానికి పలు సూచనలు చేశారు. ఏర్పాట్లపై ఎప్పటికప్పుడు సమీక్షించుకుంటూ ముందుకు వెళ్లాలని తెలిపారు. లక్షలాదిగా తరలి వచ్చే పార్టీ శ్రేణులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని తెలిపారు. సభా ప్రాంగణం దగ్గర ద్వారాలను ఏర్పాటు చేయాలని, సభ వేదికకు దారి తీసే ప్రతి మార్గం జనసేన ఫ్లెక్సీలతో అలంకరించాలని, కూడళ్లలో పార్టీ తోరణాలు కట్టాలని పబ్లిసిటీ, డెకోరేషన్ కమిటీలకు సూచనలు చేశారు.