- అడవులు ఆకుపచ్చ బంగారం – డా అడ్డాల సత్యనారాయణ
కాకినాడ : స్థానిక నాగమల్లితోట వద్ద ఉన్న శ్రీసత్య దంత వైద్యశాల సమావేశ మందిరంలో కాకినాడ ఐడిఎ ఆధ్వర్యాన ప్రపంచ అటవీ దినోత్సవం సంధర్భంగా విద్యార్థుల కు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సంధర్భంగా కాకినాడ ఐడిఎ కార్యదర్శి డా.అడ్డాల సత్యనారాయణ మాట్లాడుతూ అంతర్జాతీయ అటవీ దినోత్సవం ప్రతి సంవత్సరం మార్చి 21న అడవుల ప్రాముఖ్యత మరియు భూమిపై జీవాన్ని నిలబెట్టడంలో వాటి పాత్ర గురించి అవగాహన కల్పించడానికి జరుపుకుంటామని, ఈ సంవత్సరం ఇతివృత్తం “అడవులు మరియు ఆహారాలు”అని, అడవులు మానవ మనుగడకు మరియు పర్యావరణ సమతుల్యతకు చాలా ముఖ్యమైనవని,
ఎందుకంటే అవి ఆక్సిజన్‌ను అందిస్తాయని, కార్బన్‌ను నిల్వ చేస్తాయని మరియు జీవవైవిధ్యానికి మద్దతు ఇస్తాయని తెలిపారు.
ప్రపంచవ్యాప్తంగా ఐదు బిలియన్లకు పైగా ప్రజలు ఆహారం, ఔషధం మరియు జీవనోపాధి కోసం అటవీ మరియు కలపయేతర అటవీ ఉత్పత్తులను ఉపయోగిస్తున్నారని, అడవులు మరియు చెట్లు గింజలు, పండ్లు, విత్తనాలు, వేర్లు, దుంపలు, ఆకులు, పుట్టగొడుగులు, తేనె, అడవి మాంసం మరియు కీటకాలకు గొప్ప మూలం, ప్రజల ఆహారంలో అవసరమైన పోషకాలను అందిస్తాయని తెలిపారు.
ఆహారాన్ని అందించడమే కాకుండా, అడవులు ఆరోగ్యకరమైన నేలను కాపాడుతూ మరియు నీటి వనరులను కాపాడుతూ ఇంధనం, ఆదాయం మరియు ఉద్యోగాలను కూడా అందిస్తుందని, అటువంటి అడవి తల్లిని కాపాడుకోవాల్సిన భాధ్యత మనందరి పైన ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో కాకినాడ ఐడిఎ సిడిహెచ్ కన్వీనర్ డా.శ్రీవల్లి, డా.నాగేంద్ర, డా.చైతన్య, విద్యార్థులు పాల్గొన్నారు.