- వేలాదిమంది పేదలతో 72 ఎకరాలలో సిపిఐ భూ ఆక్రమణ పోరాటం
- ఈ భూమి కబ్జాపై పవన్ కళ్యాణ్ మాట్లాడాలి
- పవన్ కళ్యాణ్ కు లేఖ రాస్తా… రెవెన్యూ మంత్రిని కలుస్తాం
- ఈ స్థలంలో పేదలకు ఇళ్ల స్థలాలు ఇచ్చేవరకు పోరాటం ఆగదు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ పిలుపు
- కబ్జాకు గురైన సాగు భూమిని ప్రభుత్వం వెంటనే స్వాధీనం చేసుకోవాలి
- మూడు సెంట్లు భూమి కొలిసి 5 లక్షల సబ్సిడీ ఇవ్వాలి
పిఠాపురం : పిఠాపురం నియోజకవర్గం యు.కొత్తపల్లి మండలం కొమరగిరి లేఔట్ 72 ఎకరాల భూమి ప్రభుత్వ భూమిని కొంతమంది కబ్జా చేస్తున్నారని ఇది ఇళ్ల స్థలాల కొరకు కొన్న భూమి కాబట్టి ఇళ్ల స్థలాలకే కేటాయించాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ డిమాండ్ చేశారు. శుక్రవారం ఉదయం సిపిఐ ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో వేలాది మంది గ్రామీణ పేదలకు కబ్జాకు గురవుతున్న 72 ఎకరాల భూమిని స్వాధీనం చేసుకుని భూ పోరాటం నిర్వహించారు. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ వస్తున్నారని తెలియడంతో ఆ భూమిలో ఉన్న భూ కబ్జాదారులు పనిముట్లను పట్టుకొని పారిపోయారు. అనంతరం ఆ స్థలంలో ముగ్గులు వేసి ఫ్లాట్లు విభజించుకున్నారు. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ చేతుల మీదగా ముగ్గులతో హద్దులు వేసి మక్కులు వేశారు. అనంతరం జరిగిన సభకు సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యు డు తాటిపాక మధు అధ్యక్షత వహించారు. ముఖ్యఅతిథిగా పాల్గొన్న కె.రామకృష్ణ మాట్లాడుతూ ఆనాటి వై.యస్.జగన్ ప్రభుత్వం ఇళ్ల స్థలాల కొరకు కొమరగిరి పేజ్ టు 72 ఎకరాలు రైతులు వద్ద నుండి 32 కోట్లు వెచ్చించి భూమి కొందని, ఎన్నికల అనంతరం ఈ భూమిపై భూ కబ్జాదారుల కన్ను పడిందని ఆయన అన్నారు. అందులో భాగంగా 42 ఎకరాల భూమిని అక్రమంగా సాగు చేస్తూ అనుభవిస్తున్నారని, దీనిపై రెవెన్యూ అధికారులు మీనమేషాలు లెక్కిస్తున్నారని ఆయన విమర్శించారు. కొమరగిరి విఆర్వోలు భూకబ్జాదారులకు సాయం చేస్తున్నారని ఆయన అన్నారు. గత నాలుగు నెలలుగా సిపిఐ రాష్ట్రవ్యాప్తంగా పేద ప్రజలకు గ్రామీణ ప్రాంతాలలో పేదలకు మూడు సెంట్లు పట్టణాల్లో రెండు సెంట్లు ఇవ్వాలని దశల వారి పోరాటాలు నిర్వహించిందని, కొన్ని భూములలో భూపారా టం నిర్వహించిందని ఆయన పేర్కొన్నారు. ఈ పేదల భూమిపై ఇప్పటికే ముఖ్యమంత్రిని, రెవెన్యూ శాఖ మంత్రిని కలుస్తామని, ఈ కొమరగిరి భూ విషయంపై త్వరలో రెవెన్యూ శాఖ మంత్రి కలుస్తామని, జనసేన అధినేత, పిఠాపురం నియోజకవర్గ ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్ కి లేఖ రాస్తానని ఆయన తెలిపారు. అప్పటికి ప్రభుత్వం ఈ పేద ప్రజలకు ఈ భూమిలో స్థలాలు ఇవ్వకపోతే మరొకసారి ఇక్కడే మేమే వచ్చి స్థలాలు పంపకాలు చేస్తామని ఆయన తెలిపారు.
- సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు డేగ ప్రభాకర్ డిమాండ్
సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు డేగ ప్రభాకర్ రావు మాట్లాడుతూ పేద ప్రజలకు దరఖాస్తులు రాసిందని తాహసిల్దార్, ఆర్డీవోకు వినతుల అందజేసిందని, అయినా ప్రభుత్వం పెడచెవిన పెట్టిందని వారం రోజుల కల్లా సర్వే చేసి ఈ పేదలకు భూమి పంచకపోతే తాడోపేడో తేలుస్తామని డేగ ప్రభాకర్ పిలుపునిచ్చారు.
- ఏపీ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షు డు కోటేశ్వరరావు డిమాండ్
ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కోటేశ్వరరావు మాట్లాడుతూ పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని, సాగు భూములు పంపిణీ చేయాలని, వంద సంవత్సరాలుగా సిపిఐ వ్యవసాయ కార్మిక సంఘం పనిచేస్తుందని, ఈ రాష్ట్రంలో వేలాది ఎకరాలు పేదలకు పంపిణీ చేసిందని ఆయన గుర్తు చేశారు. కొమరగిరి చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలకు ఈ భూమి పంచేవరకు సిపిఐ వ్యవసాయ కార్మిక సంఘం మీకు అండగా ఉంటుందని ఆయన తెలిపారు. అధ్యక్షత వహించిన తాటిపాక మధు మాట్లాడుతూ 72 ఎకరాలను ఆక్రమించుకుని లబ్ధి పొందాలని చూస్తున్న భూ కబ్జాదారులకు వెంటనే భూమిని వదిలి వెళ్ళకపోతే సిపిఐ ఊరుకునే ప్రసక్తి లేదని ఆయన అన్నారు. సిపిఐ జిల్లా కార్యదర్శి కె.బోడకొండ మాట్లాడుతూ కాకినాడ జిల్లా కలెక్టర్ వెంటనే పవన్ కళ్యాణ్ తో మాట్లాడి పవన్ కళ్యాణ్ కొమరగిరి ప్రాంతాన్ని పర్యటించి ఈ పేదలందరికీ న్యాయం చేయాలని ఆయన పేర్కొన్నారు. సిపిఐ పిఠాపురం కార్యదర్శి శాఖ రామకృష్ణ వందన సమర్పణ చేస్తూ పిఠాపురం నియోజకవర్గంలో చాలామంది పేద, బడుగు, బలహీన వర్గాల ప్రజలకు సొంతిల్లు లేక ఆర్థికంగా సతమతమవుతున్నారని వారందరికీ సిపిఐ అండగా ఉంటుందని, ఇంకా ఇళ్ళ స్థలాలు రాస్తామని, త్వరలో మరో మూడు ప్రాంతాలలో భూ పోరాటం చేయడానికి సిద్ధంగా ఉందని శాఖ రామకృష్ణ తెలిపారు. అనంతరం యు.కొత్తపల్లి డిప్యూటీ తాహసిల్దార్ స్థలానికి విచ్చేసి 1400 మంది దరఖాస్తులను సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ చేతుల మీదుగా స్వీకరించారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి తోకల ప్రసాద్, జిల్లా కార్యవర్గ సభ్యులు పి.సత్యనారాయణ, కేశవరపు అప్పలరాజు, ఆంధ్రప్రదేశ్ మహిళా సమాఖ్య జిల్లా కన్వీనర్ ఏ.భవాని, సమాచార హక్కుల వేదిక నాయకుడు బళ్ళ సురేష్, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సహాయ కార్యదర్శి నక్క శ్రీనివాసరావు, రైతు సంఘం జిల్లా కన్వీనర్ మేడిశెట్టి వీరబాబు, తూర్పుగోదావరి జిల్లా ఏఐఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి చింతలపూడి సునీల్, ఏఐవైఎఫ్ తూర్పుగోదావరి జిల్లా ప్రధాన కార్యదర్శి పి.త్రిమూర్తులు, ఏఐవైఎఫ్ బాబి, వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు కేతా గోవిందు, వాసంశెట్టి గురవయ్య, మేడిశెట్టి శీను, కొమరగిరి వార్డ్ మెంబర్స్ కొప్పిశెట్టి త్రిమూర్తులు, శాఖ ఝాన్సీ, రాజకీయ పార్టీలకతీతంగా సర్పంచులు, ఎంపీటీసీలు హాజరయ్యారు.