Tnrnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
ఆంధ్రప్రదేశ్

అక్రమ మట్టి తవ్వకాలపై ఫిర్యాదు

పిఠాపురం : కాకినాడ జిల్లా పిఠాపురం మండలం ఎఫ్.కె.పాలెం – విరవాడ గ్రామాల మధ్యలో ఉన్న సుమారు 100 ఎకరాల పాపిడి దొడ్డు చెరువులో అక్రమంగా మట్టి తవ్వకాలు జరుపుతుండడంపై ఎఫ్.కె.పాలెం గ్రామస్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా తవ్వకాలను నిలుపుదల చేయాలని కోరుతూ సోమవారం జిల్లా కలెక్టర్ షన్మోహన్ సగిలికు ప్రజా ఫిర్యాదుల పరిష్కార కార్యక్రమంలో ఫిర్యాదు చేశారు. అనంతరం పెద్దాపురంలో ఉన్న నీటిపారుదల శాఖ ఈఈ శేషగిరిరావుకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా గ్రామానికి చెందిన రైతులు ముమ్మిడి వెంకన్న బాబు, మలిరెడ్డి పల్లపు రాజా, ముమ్మిడి వీరబాబు, రామిరెడ్డి శ్రీను, ముమ్మిడి తాతికొండ తదితరులు మాట్లాడుతూ పాపిడి దొడ్డి చెరువులో ఎటువంటి అనుమతులు లేకుండా కొందరు ఇటుక బట్టీల యజమానులు అక్రమంగా మట్టి తవ్వకాలు చేపట్టడం శోచనీయమన్నారు. ఈ సందర్భంగా మట్టి అక్రమంగా తవ్వి తరలించడానికి తీసుకొచ్చిన జెసిబి, లారీలను ఆదివారం అడ్డుకున్నామన్నారు. అనేకమంది రైతాంగానికి పుష్కలంగా సాగునీరు అందిస్తున్న ఈ చెరువులో మట్టి తవ్వకాలు చేపడితే రైతులకు తీవ్ర అన్యాయం జరుగుతుందన్నారు. సాగునీరు సక్రమంగా అందని పరిస్థితుల్లో నీటి ఎద్దడి ఏర్పడి రైతాంగానికి నష్టం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికే పలుమార్లు ఈ చెరువులో తవ్వకాలు జరిపారని, ఇప్పుడు మరోసారి అక్రమ తవ్వకాలు చేపడితే పెద్దపెద్ద గోతులు ఏర్పడి ప్రజలకు ప్రమాదం పొంచి ఉందని అన్నారు. గతంలో తవ్వకాలు జరపగా అనేక పశువులు మృత్యువాత పడ్డాయి అన్నారు. మనుషులు కూడా ప్రమాదాలకు గురైన సంఘటనలు చోటు చేసుకున్నాయన్నారు. ఈ నేపథ్యంలో ఎటువంటి అనుమతులు లేకుండా వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురం నియోజకవర్గంలో ఇటువంటి అక్రమ తవ్వకాలు ఏమిటని ఈ సందర్భంగా రైతులు ప్రశ్నించారు. ఈ విషయాన్ని పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకుని వెళతామని తెలిపారు. అవసరమైతే న్యాయపోరాటానికి సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు. హైకోర్టులో కేసు వేస్తామని తెలిపారు.

Related posts

ఏపీలో వాహనదారులకు పోలీసుశాఖ షాక్ – రేపటి నుంచి భారీ జరిమానాలు

కార్పోరేషన్ ఖజానా గుల్ల చేస్తున్న టెన్నిస్ కోర్టులు – పౌర సంక్షేమ సంఘం డిమాండ్

Dr Suneelkumar Yandra

విధుశేఖర భారతీ స్వామీజీని కలిసిన జగన్

TNR NEWS

అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకు*  *పెళ్లి ముహూర్తాల తేదీలు ఇవే*

TNR NEWS

మర్రెడ్డి కుమారుడి వివాహ రిసెప్షన్‌కి హాజరైన పిజెఏ సభ్యులు

Dr Suneelkumar Yandra

జనసేన ఆవిర్భావ దినోత్సవసభను విజయవంతం చేయాలి – కొత్తపేట నియోజకవర్గం ఇన్చార్జ్ బండారు శ్రీనివాస్ పిలుపు

Dr Suneelkumar Yandra