భావాలు అక్షరాలుగా మారి,
పొందికగా పదాలతో అమర్చి, భావవ్యక్తీకరణకు సిద్ధమై, కవనమై, గానమై, తీయని మధురమైన సంగీతంలో బయటకు వస్తుంది…
కొన్ని అక్షరాలు గాయానికి లేపనంగా పనిచేస్తాయి, మరికొన్ని అక్షరాలు ఎదిరించి ధీమాగా నిలబడతాయి, ఇంకొన్ని అక్షరాలు మెదడుపుటల్లోకి ప్రవేశించి అంతుచిక్కని ప్రశ్నలను పుట్టిస్తాయి, అలాంటి భావాలు కలిగిన అక్షరాలకు ప్రాణం పోశారు మన కవి మౌనశ్రీ మల్లిక్ గారు….
మోడుబారిన వృక్షానికి వసంతం వచ్చినట్లు, పచ్చిక బయళ్ళు అన్నీ పచ్చదనాన్ని పుంజుకున్నట్టు, వక్రీభవించిన కిరణాలు అన్ని మెరుపుల్లా రాలి పడినట్టు, రచయిత మాటల మాటను దాగిన భావాలు తుఫానుని ఎదిరించి నిలబడినట్టు గంభీరంగా ఉంటాయి, ఎనలేని ఆకాంక్షలు కొట్టిమిట్టాడుతున్న మనసులో కొన్ని అక్షరాలు సేద తీరుతున్నాయి, అమ్మ లాలింపునాలకించినట్టు నిద్రపోతున్నాయి….
ఇక కవిత్వం విషయానికి వస్తే
*****
వాగ్దానం
****
చీకట్లో ఎక్కడినుంచి ఎక్కడికో నడిచి నడిచి అలసిపోయి ఎక్కడో విశ్రమించాను
కళ్ళు తెరిచి చూస్తే
మెడకు పాములు చుట్టుకుని బుస కొడుతున్నాయి
భుజాల మీద వాలిన నెమళ్ళు
ముక్కుతో గీరుతున్నాయి
ఛాతిమీద తాబేలొకటి కన్నీళ్ళతో రోధిస్తుంది
కడుపు మీద తలపెట్టిన జింకలు ఆకలిని చప్పరిస్తున్నాయి
వాటి గుండెల్లో ఏదో సొదవుంది
లేచి చూడలేను గాని
సకల జీవరాశి నా పాదాల మీద పడి ఉంది
నేనేం చేయగలను
నేను పనికిమాలిన ఓటరును
గుట్టలను తవ్వినా, అడవులను నరికినా, భూములను అమ్ముకున్నా
ప్రాజెక్టుల పేరిట లక్షల కోట్లు దోచుకున్నా,
ఆ కీచకులను చూస్తూ మౌనం పాటించే దారిన పోయే దానయ్యను
ఇప్పుడు ప్రశ్న నుదుటిమీద తుపాకీ పెట్టబడి ఉంది
ఇప్పుడు ఉరిమే గొంతు మీద కత్తి పెట్టబడి ఉంది
ఇప్పుడు అక్షరం చుట్టూ ఊచల కంచెలు మొలుస్తున్నాయి
ఏం చేయమంటారు
కదిలితే ప్రాణం పోతుంది
ఇంతకుముందే చెప్పానుగా
మెడ చుట్టూ సర్పాలు ఉచ్చు బిగుసుకుని ఉంది
మూగజీవులారా మీరేం బాధపడకండి
ఎంతకాలమైనా సరే ఈ అరణ్యాన్ని గాలిస్తాను
శిధిలమైపోతున్న ఒక అమరవీరుడి స్థూపాన్ని కనుక్కుంటాను
వెలసిపోయిన జెండాకు నెత్తురు పులిమి కొత్త పొద్దుగా ఎగరేస్తాను…
రచయిత : మౌనశ్రీ మల్లిక్
*****
ప్రశ్న నుదుటిమీద తుపాకీ పెట్టబడి ఉంది, ఊరిమే గొంతుమీద కత్తి పెట్టబడి ఉంది, ప్రశ్నించే అక్షరం చుట్టూ ఊచల కంచెలు మొలుస్తున్నాయి…
ఏం చేయమంటారు
కదిలితే మెడకు చుట్టి ఉన్న సర్పం కాటేస్తుంది, మూగజీవులారా మీరేం బాధపడకండి…!!!
ఎంత కాలమైనా సరే ఈ అరణ్యాన్ని గాలిస్తాను, శిధిలమైపోతున్న ఒక అమరవీరుడి స్తూపాన్ని కనుక్కుంటాను, వెలసిపోయిన జెండాకు నెత్తురు పులిమి కొత్త పొద్దుగా ఎగరేస్తాను, అంటూ ఈ దౌర్జన్యాన్ని ఆపాలన్న ఆకాంక్షం మరోవైపు, తెల్లని ఖద్దరు ధరించిన గద్దలను దాటడానికి భయం మరోవైపు, కానీ ఎలాగైనా న్యాయం గెలుస్తుందని, అన్నీ మారతాయని అతని అక్షరాలతో అరణ్యానికే ఊరటనిచ్చాడు మన రచయిత….
ఒక్క మాట పోతున్న ప్రాణాన్ని కాపాడగలదు, ఒక్క మాట తగిలిన గాయాన్ని మానేలా చేయగలదు, ఒక్క మాట వద్దు అనుకున్న జీవితానికి కొత్త ఆశలు చిగురించేలా చేయగలదు,ఆ ఒక్క మాట చెప్పే మనిషి మన జీవితంలో ఉంటే ప్రతి క్షణం జీవితంలో కొత్త ఆశలు చిగురిస్తూనే ఉంటాయి…
ఇలాంటి మరెన్నో కవనాలు మీ కలం నుంచి జాలువారాలని, ప్రశ్నల బాణాలు విసురుతూ, సమాజ మార్పుకై మీ అక్షరాలు పరుగులు పెట్టాలని, మరెన్నో రచనలు నీ మనసు నుంచి పుట్టాలని, అభినందిస్తూ , మీ ఆశీర్వాదం కోరుకుంటూ…
సమీక్షకురాలు : పోలగాని భాను తేజశ్రీ