కవిత్వం
ఊహల్లో తేలే ఆలోచనలతోనే కాదు ఊహకే అందని నిజాలను కూడా కనుల ముందు సాక్షాత్కరిస్తుంది,
కవిత్వం ప్రేయసి పరువాలను, ప్రియుడి కోరికలనే కాదు, సమాజాన జరుగుతున్న మార్పులను, దిగజారి పోతున్న పర్యావసానాలను పరోక్షంగా చూపిస్తుంది…
రచయిత మల్లేశం గారి కవనాలు, వచనాత్మకంగా ఉన్నా, ప్రతి పదంలో ఎన్నో భావాలు తారస పడుతూనే ఉంటాయి, ఎంచుకున్న అంశానికి తగ్గట్టు, జరిపే విశ్లేషణ, వివరణ ఆకట్టుకునే విధంగా ఉంటాయి….
ఇక కవిత్వం విషయానికి వస్తే
**************
శీర్షిక : గని కార్మికుడు
**************
నిత్యం ప్రమాదాలతో సహవాసం
అందీ అందని ప్రాణవాయువు
పుడమి తల్లి గర్భాన కిలోమీటర్ల
కొద్దీ ప్రయాణం
భూమిపైకి వచ్చేదాకా బ్రతుకుకు భరోసా లేని చిత్రం
చీకటి గుయ్యారాలలో రాకాసి బొగ్గే(నల్ల బంగారం) ఆత్మబంధువు
బరువు మోయలేమంటూ కీళ్లు చేసే రోదన
కలుషితపు గాలి పీల్చలేమంటూ
ఊపిరితిత్తుల
ఆవేదన
పట్టుతప్పుతున్నామని కండరాలు చెప్పే సొద
ఆలి, పిల్లల పొట్ట నింపడానికి
మనసుపడే ఆరాటం
పనిచేసేశక్తి సన్నగిల్లగా సుడులు తిరుగుతున్న
బాధలో సన్నటి కన్నీటిపొర కనులకు
అడ్డుపడగా మసకదారిలో అయినా సరే పయనం ఆపని
ధీరుడే గనికార్మికుడు
రచయిత : మాచర్ల మల్లేశం
****************
నల్లని వలయాల చుట్టూ, అతని వెలుగుల కన్నులతో, ప్రతిక్షణం అంధకారంతో పోటీ పడుతూనే ఉంటాడు, గని కార్మికుడు….
నిత్యం ప్రమాదాలతో సావాసం చేస్తూ, అందీ అందని ప్రాణవాయువుతో పయనిస్తూ, భూమి లోతు పొరల్లో గనుల కోసం ఆగమ్యగోచకంగా నిరీక్షిస్తూ ఉంటాడు గని కార్మికుడు అంటూ ఒక కార్మికుడు పడుతున్న కష్టాన్ని, అందరికీ అర్థమయ్యేలా వివరించి చెప్పారు రచయిత…
భూమిపైకి వచ్చేదాకా భరోసా లేని బ్రతుకులే కదా గని కార్మికులవి, చెరసాల లాంటి ఆ అంధకారంలో రాకాసి బొక్కే కదా ఆత్మబంధువు అంటూ కన్నీటి వెదల మధ్య కరిగిపోతున్న గని కార్మికుడి జీవితాన్ని వివరణాత్మకంగా చెప్పారు రచయిత…
బరువు మోయలేక కీళ్లు చేసే రోదన, కలుషితపు గాలి పీల్చలేమంటూ ఊపిరితిత్తులు పడే ఆవేదన, పట్టు తప్పుతున్నామని కండరాలు చెప్పే సొద, వీటన్నిటినీ మించి, ఆలి పిల్లల కోసం మనసు పడే ఆరాటం ఈ రెండిటి మధ్య అతలా కుతలం అవుతూ గని కార్మికుని హృదయం….
పని చేసే శక్తి లేకపోయినా కన్నీటి సుడులు తిరుగుతున్న కనుల వెనుక దాచిన బాధ, మసకదారిలో అయినా సరే పయనం ఆపక జీవనాన్ని సాగిస్తున్న ధీరుడే కదా గని కార్మికుడు అంటూ ఎంతో సుమశయంగా వివరించారు మల్లేశం గారు….
ఒక కార్మికుడు పడుతున్న కష్టాన్ని ఎంతో ఓర్పుతో,నేర్పుతో వివరించి చెప్పారు, ఇలాగే మరెన్నో కవనాలు మీ కలం నుంచి పుట్టుకురావాలని, సమాజ శ్రేయస్సుకై, మార్పుకై మీరు చేస్తున్న కృషి ఫలించాలని, మరెన్నో రచనలు చేస్తూ మీ అభివృద్ధి గగనాన్ని తాకాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను…
***************
సమీక్షకురాలు : పోలగాని భాను తేజశ్రీ