Tnrnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
ఆంధ్రప్రదేశ్

నీ ఆలోచనే – నీ విజయం

విస్తుపోయిన మనసుకి ఊరట నిచ్చే మాటలు కొన్ని అయితే, ఉత్తేజాన్ని రేకెత్తించే మాటలు ఇంకొన్ని, ఓదార్పు ఇచ్చే మాటలు కొన్ని అయితే, ఓడించాలని చెప్పే మాటలు ఇంకొన్ని, ఏ మాట అయినా సరే ఒక లిపి నుంచి పుడుతుంది, అక్షరంగా రూపుదిద్దుకుంటుంది, అలాంటి అక్షరం ఎందరు జీవితాలకు వెలుగు దివ్వెలా మారుతుంది, ఒక మనిషి ఓటమి ఆలోచన వలన, ఎదుటి వ్యక్తి చెప్పే మాటల వలన కలగొచ్చు, అలాగే ఒక మనిషి విజయం అదే ఆలోచన వలన, ఎదుటి వ్యక్తి చెప్పే మాటల వలన కూడా కలుగుతుంది, ఏది ఏమైనా మానవ జీవనానికి ఆధారం మాట అంటే అక్షరం

 

ఇలాంటి అక్షరాలతో ఒక మహాసంగ్రామాన్ని సృష్టిస్తున్నారు యువ కవి ప్రసన్న కుమార్ గారు,అతని కలం నుండి పురుడు పోసుకున్న కవనాలు పాఠకులకు ఒక కొత్త ఆలోచనను పుట్టిస్తాయి, ఏదో సాధించాలి అన్న సంకల్పాన్ని రేకెత్తిస్తాయి, మన పుట్టుకకు కారణం ఏంటి అని యోచించాలని, తెలుసుకోవాలని ఆరాటం పుట్టిస్తాయి, అలాంటి కోవకు సంబంధించిన కవనాలు అలవోకగా రాయాలి అంటే ఎవరైనా ఈ రచయిత తరువాతే అని చెప్పవచ్చు….

 

ఇక కవిత్వం విషయానికి వస్తే

*******

ఎవరు వారు

*****

ఎన్నో బాధ్యతలు మీద వేసి నిన్ను వెనక్కి లాగుతారు

ఆ లాగిన చేతులు నరికి అయినా నువ్వు ముందుకి వెళ్ళు…

 

నీ వల్ల కాదు అని కారుకూతలు కూస్తారు

వాటిని పెడచెవిన పెట్టి మరీ ముందుకు సాగిపో….

 

మహామహుల వల్లే కాలేదు నీవల్ల ఏమవుతుంది అంటూ కుంగదీస్తారు

నావల్ల ఎందుకు అవ్వదు అని పంతంతో దూసుకుపో…

 

అర్థం లేని వృథాయాపనతో నీ కాలాన్ని కాల్చేస్తారు

అర్థం లేని మాటలను సైతం నీ అభ్యున్నతికి వినియోగించుకో…

 

ఎవరు వారు…!!!

నీ బలాబలాలను అంచనా వేయడానికి..!?

ఎవరు వారు నీ వల్ల కాదు అని నిర్ణయించడానికి..!?

 

నీ మార్గం నువ్వే నిర్ణయించుకో

నీవున్నతికి మెట్లు నువ్వే వేసుకుంటూ ముందుకు సాగిపో

నీ మీద వేసిన రాళ్ళను పేర్చుకుంటూ ఒక మహా సామ్రాజ్యాన్ని నీ నేర్పుతో నిర్మించుకో…

 

నీ చేతికి వేసిన సంకెళ్లను తెంచు

నీ ముందరి కాళ్లకు వేసిన బంధాన్ని బద్దలు కొట్టు

ఎవరు ఊహించనంత ఎత్తుకు ఎదిగి నువ్వేంటో నిరూపించుకో…

 

రచయిత : కొల్లు సాయి ప్రసన్న కుమార్

******

పుట్టిన వాడు గిట్టక తప్పదు, అలా అని ఎప్పటికైనా పోయే ప్రాణమే కదా అని ఏమీ చేయకుండా కూర్చుంటే బాధ్యత అనే ఒక బరువైన వస్తువుని నీపై వేసి నీ పుట్టుకకే అర్థం లేకుండా చేస్తుంది ఈ సమాజం అందుకే ఆ బాధ్యత వేసిన చేతులను నరికి అయినా సరే నువ్వు వెనుతిరగకుండా ముందుకు సాగిపో అంటూ ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తూ రాశారు మన కవి…

 

నీవల్ల కాదని కొందరు, మహామహుల వల్లే కానిది నీవల్ల అవుతుందా అని కొందరు, నిన్ను చచ్చు దద్దమ్మను చేయడానికి మాటల తూటాలను నీపై విసురుతూనే ఉంటారు ఆ మాటలన్నీ పంతంగా మార్చుకుని ముందుకు దూసుకుపో అంటూ ఎవరిని లెక్కచేయకు అన్న సంకల్పాన్ని నీలో నింపుకో అని చెప్పకనే చెబుతున్నారు మన రచయిత…

 

కాలాన్ని వృధా చేస్తూ, కాకి కూతలు కూస్తున్న జనుల అర్థంలేని మాటలను నీ మనసుకు తీసుకోకుండా, ప్రతి వాక్యాన్ని ప్రతి ఘడియని నీ అభ్యున్నతికి వినియోగించుకో అంటున్నారు ఈ యువ కవి…

 

అసలు ఎవరు వారు

నీవేం చేయగలవు చేయలేవో చెప్పడానికి..

నీవల్ల కాదు అని నిర్ణయించడానికి…!?

నీ విజయానికి మార్గం నీవే వేసుకో. నీ మీద వేసే రాళ్ళను పేర్చుకుంటూ ఒక గొప్ప సామ్రాజ్యాన్ని నీ నేర్పుతో చేర్పుతో నిర్మించుకో…

నీ చేతికి వేసిన సంకెళ్లను తెంచి ముందరకాలకు వేసిన బంధాన్ని బద్దలు కొట్టి

కష్టించి, ఓర్పుతో ఒక అడుగు ముందుకు వేసి నువ్వేంటో నిరూపించుకో నీ వల్ల ఏదీ కాదు అన్న వాళ్లకు నువ్వేంటో చూపించు…

 

అని డీలా పడిపోయిన ఒక మనిషి జీవితాన్ని మనసుని ఎంతో ప్రేరేపిస్తూ , విజయాన్ని సాధించడమే మన జీవితానికి అర్థం అనే నినాదాన్ని చెబుతూ, ప్రతికూలంగా, ప్రత్యామ్నాయంగా, పరిస్థితులను అర్థం చేసుకుని, ప్రజల కోసం కాకుండా నీకోసం నువ్వు బ్రతుకు నీ విజయం కోసం నువ్వు ఆరాటపడు అని ఎంతో అద్భుతంగా రచించారు యువకవి ప్రసన్న కుమార్ గారు…

 

ఇలాంటి మరెన్నో కవనాలు మీ కలం నుంచి పుట్టాలని, ఎందరో జీవితాన్ని ప్రేరేపించేలా మీ రచనలు ఉండాలని, మీ రచనలతో ఎందరికో మార్గ నిర్దేశం చేయాలని, ఆకాశమంత స్థానాన్ని మీరు అధిరోహించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను…

 

సమీక్షకురాలు : పోలగాని భానుతేజశ్రీ MBA LLB

Related posts

“హలో దుర్గాడ – ఛలో చిత్రాడ” అంటూ దుర్గాడ గ్రామంలో ఇంటింటి ప్రచారం

Dr Suneelkumar Yandra

ఘనంగా బాబూ జగజ్జీవన్ రామ్ జన్మదిన వేడుకలు

ఎందరో మహానుభావుల త్యాగ ఫలితం స్వతంత్రం – డా ఉమర్ ఆలీషా

Dr Suneelkumar Yandra

మార్చి 14న జరగబోయే జనసేన ఆవిర్భావ సభకు ప్రజలందరినీ ప్రత్యేక ఆహ్వానం పలుకుతున్న

Dr Suneelkumar Yandra

కుక్కుటేశ్వరుడి నిత్యన్నదానానికి భాస్కరనారాయణ రాజు దంపతులు విరాళం

Dr Suneelkumar Yandra

థాంక్యూ పిఠాపురం

Dr Suneelkumar Yandra