హైదరాబాద్ : మొక్కలు నాటండి పర్యావరణాన్ని కాపాడండి అని జీవనది ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షురాలు ఇంటి లక్ష్మీ దుర్గ అన్నారు. శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం సప్తమి పీఠాధిపతి అవతారి శ్రీ హుస్సేన్షా 120వ జయంతి సందర్భంగా జీవనది ఫౌండేషన్ మరియు ఉమర్ ఆలీషా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ సంయుక్త ఆధ్వర్యంలో హైదరాబాద్ లో మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా జీవనది ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షురాలు ఇంటి లక్ష్మీ దుర్గ మాట్లాడుతూ ఉమర్ ఆలీషా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ వ్యవస్థాపకులు, శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం నవమ పీఠాధిపతి డాక్టర్ ఉమర్ ఆలీషా పిలుపు మేరకు “నా మొక్క – నా శ్వాస” కార్యక్రమం ద్వారా ప్రతి ఒక్కరూ మూడు మొక్కలు నాటి, వాటి సంరక్షణ చేపట్టాలని ఉమర్ ఆలీషా పిలుపునివ్వడం జరిగిందన్నారు. మొక్కలు నాటడం ద్వారా పర్యావరణాన్ని పరిరక్షించవచ్చని, మొక్కలు పెంచడం ద్వారా ప్రకృతి ఎంతో ఆహ్లాదకరంగా చక్కటి వాతావరణం ఏర్పడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో జీవనది ఫౌండేషన్ సభ్యులు, మన్సురాబాద్ ప్రాథమిక పాఠశాల విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.