మోతే : మోతే మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో నెలకొన్న మౌలిక సమస్యలు వెంటనే పరిష్కరించాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి మట్టి పెల్లి సైదులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శుక్రవారం తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం మోతె మండల కమిటీ ఆధ్వర్యంలో జిల్లా కమిటీ పిలుపులో భాగంగా మోతె ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో నెలకొన్న సమస్యలపై సర్వే నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో సౌకర్యాలు మెరుగుపరచాలని కోరారు. రోగులు తాగటానికి మంచినీళ్లు లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఖాళీగా ఉన్న పోస్టులను వెంటనే భర్తీ చేయాలన్నారు. మోతె ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో డయాలసిస్ సెంటర్ ను ప్రారంభించాలన్నారు. ప్రభుత్వ ఆసుపత్రికి ఒక్క అటెండర్ ఉండటం వల్ల రక్షణ కరువైందని ప్రభుత్వం వెంటనే మరొక అటెండర్ ను నియామకం చేయాలన్నారు. ప్రభుత్వ ఆసుపత్రులలో పనిచేస్తున్న ఏఎన్ఎం లను పర్మనెంట్ చేయాలన్నారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో కిటికీలు, తలుపులు లేవన్నారు. ఆసుపత్రి పరిశుభ్రంగా లేకపోవడంతో ఆస్పత్రిలోకి పాములు, తేళ్లు వంటి విషపురుగులు వస్తున్నాయన్నారు. ప్రభుత్వ ఆసుపత్రిలో జనరేటర్ సౌకర్యం లేకపోవడంతో రోగులకు ఇబ్బంది జరుగుతుందన్నారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాని 50 పడకల ఆసుపత్రిగా డెవలప్ చేయాలన్నారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో 24 గంటలు వైద్యం అందేలా చర్యలు చేపట్టాలన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం మహిళా కూలీల జిల్లా కన్వీనర్ జంపాల స్వరాజ్యం, వ్యవసాయ కార్మిక సంఘం మండల కార్యదర్శి కిన్నెర పోతయ్య, సిఐటియు మండల కన్వీనర్ దోస పాటి శ్రీనివాస్, వ్యవసాయ కార్మిక సంఘం మండల నాయకులు చర్లపల్లి మల్లయ్య, మేకల ఉపేందర్ పాల్గొన్నారు.
