రోడ్డు భద్రత, రోడ్డు ప్రమాదాల నివారణ కోసం సూర్యాపేట జిల్లా పోలీస్ శాఖ నిరంతరం కృషి చేస్తుంది, దీనిలో భాగంగా రాత్రింబవళ్లు పెట్రోలింగ్ నిర్వహిస్తూ పటిష్టంగా తనిఖీలు నిర్వహిస్తుంది, రోడ్డు ప్రమాద స్థలాలను పరిశీలిస్తూ నివారణ చర్యలు తీసుకోవడం, గ్రామీణ రోడ్డు భద్రత కమిటీల ఏర్పాటు చేయడం లాంటి చర్యలు చేపట్టింది. దీనిలో భాగంగా ఈరోజు జిల్లా ఎస్పీ నరసింహ ఐపిఎస్ గారు సూర్యాపేట ట్రాఫిక్ ఎస్ఐ సాయిరాం తో కలిసి సూర్యాపేట జిల్లా కేంద్రంలోని జాతీయ రహదారి 65 కొత్త వ్యవసాయ మార్కెట్ రోడ్ జంక్షన్ ను పరిశీలించారు. వాహనాల యొక్క వేగం, ప్రజల రాకపోకలు, రోడ్డు క్రాసింగ్, ఇంజనీరింగ్ లోపాలు, లైటింగ్ ఏర్పాట్లు, బారికేడ్ ల ఏర్పాటు మొదలగు అంశాలను పర్యవేక్షణ చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ గారు మాట్లాడుతూ సూర్యాపేట జిల్లా పోలీస్ నిరంతరం ప్రజల రక్షణలో కృషి చేస్తుంది, ప్రజాభద్రత, రోడ్డు ప్రమాదాల నివారణ కోసం తపనతో ముందుకు వెళ్తున్నామని సూచించారు. బ్లాక్ స్పాట్స్ వద్ద స్థానిక ప్రజలు ఎక్కువగా ప్రమాదాలకు గురవుతున్నారని అన్నారు. రోడ్డు ప్రమాద స్థలాల వద్ద స్థానిక ప్రజలు జాగ్రత్తగా ఉంటూ రోడ్లు దాటాలని విజ్ఞప్తి చేశారు. జాతీయ రహదారులపై వాహన నియంత్రణకు సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామని వేగ నియంత్రణతో వాహనాలు నడపాలని, రోడ్ల వెంట ఎక్కడపడితే అక్కడ వాహనాలను పార్కింగ్ చేయద్దు అని తెలిపారు. ప్రమాదాల నివారణ కోసం జిల్లా వ్యాప్తంగా 43 రోడ్డు ప్రమాద నివారణ కమిటీలను ఏర్పాటు చేశామని, రోడ్డు భద్రత పట్ల ప్రజల్లో విస్తృతంగా అవగాహన కల్పిస్తున్నామని అన్నారు. ప్రయాణ సమయంలో ముందు జాగ్రత్తలే శ్రీరామరక్ష, ప్రతి ప్రయాణం సురక్షితంగా గమ్యం చేరాలని కోరారు.
previous post
