మంథని(పెద్దపల్లి):
అనేక అబద్దాలు, మోసపూరిత మాటలతో అధికారంలోకి వచ్చిన మంథని ఎమ్మెల్యే దగాకోరు…మోసగాడు అని మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్ విమర్శించారు. బుధవారం పెద్దపల్లి జిల్లా భీఆర్ ఎస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ నేషనల్ హైవేలో భూములు కోల్పోతున్న భూ నిర్వాసితులకు రూ.25లక్షల పరిహారం ఇవ్వాలని 2023లో ప్రధాన మంత్రికి, ముఖ్యమంత్రికి లేఖ రాశారని ఆయన గుర్తు చేశారు. అయితే నేషనల్ హైవే నిర్మాణంలో నియోజకవర్గంలో వందల ఎకరాల్లో భూములు పోతున్నాయని, అందులో మంథని మండలం పుట్టపాక ప్రధాన రహదారి పక్కనే ఉన్న భూములకు ప్రస్తుతం కోటి రూపాయల విలువ ఉందన్నారు. ఈ క్రమంలో మంథని ఎమ్మెల్యే రూ.25లక్షలు పరిహరం ఇవ్వాలని లేఖ రాసి పత్రికల్లో వేయించుకున్నాడని ఆయన అన్నారు.అయితే ప్రధాన మంత్రికి రాసిన లేఖ తెలుగులో రాయడం విడ్డూరంగా ఉందని, కేంద్రానికి ఎవరైనా లేఖ రాస్తే తెలుగులో రాస్తారా అని ఆయన విమర్శించారు. ప్రజలను మభ్యపెట్టి మోసం చేయడానికి ఇలా చేశాడని, అయినా ఆయన ఉన్నత విద్యావంతుడని, మేధావి అంటూ గొప్పలు చెప్పుకోవడం సిగ్గు చేటు అన్నారు. ఈనాడు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోనే ఉందని, మంథని ఎమ్మెల్యే మంత్రి హోదాలో ఉండి కూడా ఇప్పటి వరకు నేషనల్ హైవే నిర్వాసితులకు న్యాయం చేయాలనే ఆలోచన చేయలేదన్నారు. కనీసం కలెక్టర్‌తో చర్చించి నిర్వాసితులకు ఎలా చేస్తే న్యాయం జరుగుతుందని సమీక్ష చేయలేదన్నారు. తమకు ఎదో మేలు చేస్తారని ఓట్లు వేసి ఉన్నతపదవి అప్పగించిన ప్రజలకు ఏం చేశాడని ఆలోచన చేయాలన్నారు. భూసేకరణ విషయంలోనే నిర్వాసితులకు న్యాయం జరుగకపోవడంతో కొడంగల్ నియోజకవర్గంలోని లగచర్లలో జిల్లా కలెక్టర్, అధికారులపై ప్రజలు ఎదురుతిరిగారని అన్నారు. లగచర్ల సంఘటనలో కుట్ర జరిగిందని, ఎవరిని వదిలిపెట్టమని ప్రకటనలు చేయడం కాదని, నిర్వాసితులకు న్యాయం చేయాలనే ఆలోచన చేయాలని ఆయన హితవు పలికారు. లగచర్ల ఘటనలో అందరిపై కేసులు పెడుతామని అంటున్నారని, అసలు కేసులు పెట్టాల్సి వస్తే కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు, నాయకులపై పెట్టలన్నారు. నాటినుంచి నేటి వరకుప్రజలను మోసం చేసి దగా చేసిన కాంగ్రెస్ నాయకులపై చీటింగ్ 420 కేసు పెట్టాలని ఆయన అన్నారు. జిల్లా కలెక్టర్ సైతం నేషనల్ హైవే నిర్మాణ విషయంలో నిర్వాసితులకు న్యాయం చేసేలా చూడాలని, ఎమ్మెల్యే చెప్పినట్లు చేస్తామని ఆయన మాటలు వింటే ప్రజల తిరుగుబాటు తప్పదన్నారు. ఆనాడు నిర్వాసితులకు రూ.25లక్షల పరిహారం ఇవ్వాలని లేఖ రాస్తే ప్రజల నమ్మారని, కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈనాడు అది మన పరిధిలో లేదు కేంద్రం పరిధిలో ఉందంటూ దాటవేస్తున్నాడని, పరిహారంలో కూడా ఎంతో మంది కాంగ్రెస్ వాళ్లు ఉన్నారని ఆయన వివరించారు. ఇప్పటికైనా అధికారులు నేషనల్ హైవే నిర్వాసితులకు ముందుగా మార్కెట్ విలువ ప్రకారం పరిహరం చెల్లించి ఫీల్డ్‌లోకి రావాలన్నారు. అలాగే మంథని ఎమ్మెల్యేకు చిత్తశుద్ది ఉంటే నిర్వాసితులకు ఎకరాకు రూ.50లక్షలు ఇప్పించాలని, అలాగే ఇండ్లకు సైతం సరైన కొలతలు తీసి నష్టపరిహరం ఇప్పించాలని ఆయన డిమాండ్ చేశారు.