ఇటీవల తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన జూనియర్ లెక్చరర్ ఉద్యోగ ఫలితాలలో చేవెళ్ల మండల పరిధిలోని అంతారం గ్రామానికి చెందిన ఘనపురం సుదర్శన్ గెజిటెడ్ హోదా కలిగిన ప్రభుత్వ తెలుగు జూనియర్ లెక్చరర్ గా ఎంపికయ్యాడు. సుదర్శన్ కు జూనియర్ లెక్చరర్ ఉద్యోగం రావడం పట్ల గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఆ గ్రామ మాజీ సర్పంచ్ భర్త, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ జూనియర్ లెక్చరర్ సంఘం మాజీ రాష్ట్ర అధ్యక్షుడు నడికూడె అంజన్ గౌడ్ ఆధ్వర్యంలో ఆదివారం సుదర్శన్, తన తండ్రి పర్మయ్యకు శాలువాలు కప్పి సన్మానించారు. ఈ సందర్భంగా అంజన్ గౌడ్ మాట్లాడుతూ.. అంతారం గ్రామంలో ప్రభుత్వ జూనియర్ లెక్చరర్ ఉద్యోగం తన తర్వాత సుదర్శన్ సాధించడం తనకు గర్వంగా ఉందన్నారు. ప్రస్తుతం ఉన్న పోటీ ప్రపంచంలో ఒక్క ప్రభుత్వ ఉద్యోగం రావడమే గగనం. అలాంటిది ఓవైపు సుదర్శన్ ప్రస్తుతం పోలీసు కానిస్టేబుల్ విధులు నిర్వహిస్తూ.. కష్టపడి చదివితే ఉద్యోగాల సాధన కష్టమేమీ కాదని నిరూపించడం అభినందనీయమన్నారు. ఎదైనా సాధించాలంటే పట్టుదల, దృఢ సంకల్పం అవసరమన్నారు. గ్రామంలోని యువత సుదర్శన్ ను ఆదర్శంగా తీసుకొని ఉన్నత చదువులు చదివి ప్రభుత్వ ఉద్యోగాలు సాధించాలని ఆకాంక్షించారు. భవిష్యత్తులో సుదర్శన్ గ్రూప్ వన్ ఉద్యోగం సాధించాలని ఆకాంక్షించారు. అనంతరం సుదర్శన్ మాట్లాడుతూ.. తన తల్లిదండ్రులు పడే కష్టాన్ని చూసి ఉన్నత ఉద్యోగం సంపాదించాలని నిర్ణయించుకున్నన్నారు. తన పట్టుదల, కష్టం ఫలించి ప్రభుత్వ జూనియర్ లెక్చరర్ ఉద్యోగానికి ఎంపికయ్యానన్నారు. భవిష్యత్ లో పేదవారికి తన స్థాయి తగిన సాయం చేస్తానన్నారు. ఈ సన్మాన కార్యక్రమంలో ప్రభుత్వ ఉపాధ్యాయులు యూసుఫ్, గ్రామస్తులు వీరాంజనేయులు, సుధాకర్, సిద్ధు, నవీన్, రమేష్, తదితరులు పాల్గొన్నారు.
next post