ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం, కాకినాడ జిల్లా, పిఠాపురం మండలానికి చెందిన పట్టణం, మండల కేంద్రం. ఇక్కడ గల కుక్కుటేశ్వర ఆలయం, పురుహూతికా దేవి ఆలయం ప్రముఖ పర్యాటక ఆకర్షణలు. మరియు తిరుమల తిరుపతి దేవస్థానములు అనుసందాన దేవాలయము శ్రీ పద్మావతి సమేత శ్రీ వేంకటేశ్వర స్వామి దేవాలయము విశేషముగా ఉన్నది.
పిఠాపురాన్ని పూర్వం పీఠికాపురం అనేవారు. ఈ ఊరికి అధిపతి పీఠాంబ.ఈ పీఠాంబ విగ్రహం ఒకటి – ఒక చేతిలో అమృతం పాత్ర, వేరొక చేత బాగుగా పండిన మాదీఫల కాయ, మూడవ చేత డాలు, నాల్గవ చేత లోహ లోహదండం ధరించి – నేటి పిఠాపురానికి సమీపంలో, నాలుగు వీధులు కలిసే కూడలిలో ఉండేదట. ఇటువంటి విగ్రహమే ఒకటి ఈనాడు కొత్తపేటలో స్వామి ఆలయంలో ఉంది. జిల్లా కేంద్రమైన కాకినాడ కు ఉత్తరంగా 15 కి.మీ దూరంలో వుంది. పిఠాపురం పురపాలక సంఘం పట్టణ పరిపాలన నిర్వహిస్తుంది. జాతీయ రహదారి 216 పైనుంది. ఈ పట్టణం మద్రాసు-హౌరా రైలు మార్గంలో ఉంది.
కుక్కుటేశ్వరస్వామి ఆలయ సముదాయంలో పురుహూతికా దేవి ఆలయం ఉంది. ఇది అష్టాదశ శక్తి పీఠాలలో ఒకటి. భారతదేశం లోని అష్టాదశ మహా శక్తి పీఠములలో ఒకటైన హుంకారిణీ శక్తి పీఠం ఈ కుక్కుటేశ్వరుడి దేవళంలో ఉండేది. పుస్తకాలలో, పురాణాలలో కల ఈ పీఠం కాని, ఆ శక్తి విగ్రహం కాని ప్రస్తుతం కానరావు. ఈ పీఠం మూలంగానే పిఠాపురానికి పీఠికాపురం అనే పేరు వచ్చిందని అంటారు. ఈ హుంకారిణీ శక్తి విగ్రహం రైలు స్టేషనుకి ఎదురుగా ఉన్న మట్టి దిబ్బలో భూస్థాపితమై ఉన్నదని లోక ఐతిహ్యం ఉంది. పురావస్తు పరిశోధక శాఖ వారు తవ్వకాలు జరిపించి చూస్తే కనిపించవచ్చని ప్రజలు అనుకొంటారు.
పిఠాపురం సంస్థానాన్ని వెలమ రాజులు పాలించే వారు. వీరిలో సూర్యారావు బహదూర్ ప్రముఖుడు. ఈయన సాహిత్యాన్ని బాగా పోషించాడు.