కాకినాడ : కాకినాడ బాణాసంచా పేలుడులో ఊహించని రీతిగా గాయపడిన నగరానికి చెందిన అయిదుగురు కార్మికులలో గజ్జల మధుకుమార్ 60శాతం కాలిన గాయాలకు గురయ్యి జిల్లాప్రభుత్వ ఆసుపత్రి ఐసియులో వుండగా బొండు అశోక్, మేడిశెట్టి లోవరాజు ఇరువురు ఇరవై, ముప్పై శాతం కాలిన గాయాలతో బర్నింగ్ వార్డులో చికిత్స పొందుతుండగా డి.నగేష్, బొందల పోతురాజు చికిత్స పొంది మంగళవారం డిశ్చార్జ్ అయ్యే పరిస్థితులను పౌర సంక్షేమ సంఘం పరిశీలించింది. వీరిలో గజ్జల మధు తీవ్రంగా గాయపడడం ఆందోళనగా వుందన్నారు. ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు. రెక్కాడితే గాని డొక్కాడని ఆ అయిదుగురు పొట్ట కూటి కోసం ట్రాన్స్ పోర్ట్ కూలీకి వెళితే బాణాసంచా సామాగ్రి ఎగుమతి దిగుమతిలో యాజమాన్యాలు అనుసరించాల్సిన పద్ధతులు పాటించకుండా జరిగిన తప్పిదాల వలన ఘోరప్రమాదానికి వారి కుటుంబాలు బలవ్వడం జరిగిందన్నారు. జిల్లా పోలీస్, రెవిన్యూ యంత్రాంగం సకాలంలో స్పందించి జిజిహెచ్ లో మెరుగైన వైద్యం అందించడం మంచి పరిణామంగా పేర్కొన్నారు. అవసరం అయితే కార్పోరేట్ ఆసుపత్రుల్లో వైద్యం అందించేందుకు ప్రభుత్వం ముందుకు రావాలన్నారు. ఆ కుటుంబాలకు మానవతా దృక్పథంతో ప్రభుత్వం ప్రత్యేక ఆర్థిక సహాయం అందించి ఆదుకోవాలని పౌర సంఘం కన్వీనర్ సామాజిక వేత్త దూసర్లపూడి రమణరాజు కోరారు. బాణాసంచా ఎగుమతి, దిగుమతికి చెందిన వర్తకులు ట్రాన్స్ పోర్ట్ యాజమాన్యం వారికి తగిన వైద్య సహాయం సేవలకు జీవనభృతికి ఆర్థిక సహాయం ప్రకటించాలన్నారు. సాధారణ ట్రాన్స్ పోర్ట్ లో ప్రేలుడు వస్తువులు దీపావళి బాణాసంచా బట్వాడా చేస్తే విలువైన వస్తువులు ప్రాణాలు కోల్పోయే దుస్థితి దాపురించడం తెలిసి నిర్వహించడం శిక్షార్హమైన నేరంగా పేర్కొన్నారు.