సూర్యాపేట టౌన్ : అర్హులైన పేదలందరికీ ఇండ్లు, ఇండ్ల స్థలాలు ఇవ్వాలని సిపిఎం పార్టీ వన్ టౌన్ కార్యదర్శి వల్లపు దాసు సాయికుమార్ అన్నారు. మంగళవారం23 వార్డు లో సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ప్రజా సమస్యలపై సర్వే నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఇల్లు లేని నిరుపేదలందరికీ ఇందిరమ్మ పథకం ద్వారా ఇండ్లు కట్టిస్తామని చెప్పి అధికారంలోకి వచ్చి 15 నెలలు అవుతున్న నేటికీ ఏ ఒక్కరికి ఇల్లు నిర్మించిన పాపాన పోలేదన్నారు. రాష్ట్రంలో 30 లక్షల కుటుంబాలు సొంత ఇల్లు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం మండలానికి ఒక గ్రామంలో మాత్రమే ఇందిరమ్మ ఇల్లు ఇస్తామని చెప్పడం సమంజసం కాదన్నారు. అర్హులైన పేదలందరికీ ఇండ్లు నిర్మించి ఇవ్వాలన్నారు. ఇంటి స్థలం లేని వారికి కొనుగోలు చేసి ఇవ్వాలన్నారు. కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారెంటీలలో ఉచిత బస్సు మినహా ఏ ఒక్క హామీ నేటికి అమలు కాలేదు అన్నారు. వృద్ధులు, వితంతువులు, వికలాంగులు, ఒంటరి మహిళలు, చేతి వృత్తుదారుల పింఛన్లు పెంచుతామని చెప్పిన ప్రభుత్వం నేటికీ పెంచలేదన్నారు. ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కింద ఏడాదికి 12000 ఇస్తామని చెప్పిన హామీ అమలుకు నోచుకోలేదన్నారు. పట్టణ ప్రాంత భూమిలేని పేదలకు కూడా ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం వర్తింప చేయాలన్నారు. రైతాంగానికి రైతు భరోసా, రుణమాఫీ నేటికి పూర్తి కాలేదు అన్నారు. సన్నధాన్యానికి కింటాకు 500 రూపాయలు బోనస్ ఇస్తామని చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం నేటికీ ఏ ఒక్క కింటాకు బోనస్ ఇవ్వలేదన్నారు. పట్టణ ప్రాంతంలో ఉన్న కూలీలకు ఉపాధి హామీ పనులు కల్పించాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే ప్రజా సమస్యలను పరిష్కరించాలని లేనియెడల ప్రజా సమస్యలపై అలుపెరుగని ఉద్యమాలు నిర్మిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం పట్టణ కమిటీ సభ్యులు మామిడి పుల్లయ్య, కప్పల సత్యం, మల్లేష్, వెంకటమ్మ, మల్లమ్మ, పద్మ, కవిత తదితరులు పాల్గొన్నారు.