- రెండున్నర దశాబ్దాలుగా ప్రయాణికుల దాహార్తిని తీరుస్తున్న చిరు వ్యాపారి అనపాల
కాకినాడ : రెండున్నర దశాబ్దాలుగా ప్రయాణికుల దాహార్తిని తీరుస్తున్న చిరు వ్యాపారి అనపాల ఆంజనేయరెడ్డి సేవలు స్పూర్తిదాయకమని కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం వెంకటేశ్వరరావు (నానాజీ) అన్నారు. శనివారం రమణయ్యపేట ఏపీఐఐసీ కాలనీ వద్ద అనపాల ఆంజనేయరెడ్డి స్వచ్చంద సేవా సంస్థ అధ్యక్షుడు ఆంజనేయరెడ్డి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న చలివేంద్రం ఏర్పాటుచేసి 25 సంవత్సరాలు పూర్తయిన సందర్భాన్ని పురస్కరించుకుని మజ్జిగ, త్రాగునీరు చలివేంద్రం, పక్షులకు ఆహారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్లాస్టిక్ సామాన్లు విక్రయిస్తూ వచ్చిన ఆదాయంలో నుంచి సగభాగాన్ని సేవా కార్యక్రమాలకు వినియోగించడం అభినందనీయమన్నారు. వేసవిలోనే కాకుండా ఏడాదంతా ప్రయాణికులకు చలివేంద్రం ఏర్పాటుచేసి దాహార్తిని తీర్చడం సామాన్య విషయం కాదన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన అన్నదాన కార్యక్రమాన్ని రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో అడబాల రత్నప్రసాదరావు, కరెడ్ల గోవిందు, శిరంగు శ్రీనివాసరావు, పాండ్రంకి రాజు, కుడుపూడి బాలాజీ, తురగా సంతోష్, పుల్ల శ్రీరాములు, సతీష్ తదితరులు పాల్గొన్నారు.