Tnrnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
ప్రత్యేక కథనం

అనుకుంటే చేయలేనిదేది లేదు

కొన్ని అక్షరాలు జీవితానికి ఆదర్శాలు

కొన్ని అక్షరాలు ఆకాశాన్ని తాకే అరుణతారలు

కొన్ని అక్షరాలు నిగర్వంగా నిలబడే నిజాయితీలు

కొన్ని అక్షరాలు ఓదార్పునిచ్చే అమ్మ  నవ్వులు

కొన్ని అక్షరాలు ధైర్యాన్ని ఇచ్చే నాన్న మాటలు

ఆప్తులు లేని జీవితం ఉండొచ్చేమో కానీ, అక్షరం లేకపోతే భవిష్యత్తు ఉండదు

కోపమో, ప్రేమో,భాదో లేక ద్వేషమో ఏదైనా సరే భావాలతోనే కదా చూపించేది, ఆ భావాలతో ముడిపడినదే అక్షరం…

 

అలాంటి అక్షరం ఎన్నో వేల మెదళ్లను ఆలోచించేలా చేస్తుంది, బాధ వస్తే ఊరటనిస్తుంది, స్నేహంలా ప్రతిక్షణం పక్కనే ఉంటుంది, భావోద్వేగాలను బయటకు చూపిస్తుంది…

 

ప్రస్తుత సమాజ పరిస్థితి ఏమిటో, జనుల మనస్తత్వాలు ఏమిటో, ఎవరు ఏం ఆశిస్తున్నారో, ఏ విధంగా ప్రవర్తిస్తున్నారో, ఒక బంధం ఏమీ ఆశించకుండా నీతో ఉంటుందా..!?

సంతోషంగా ఉన్నప్పుడు మాత్రమే కాదు, కష్టంలో కన్నీటిలో కూడా తోడుగా ఉండేదే బంధం అంటూ సమస్తాన్ని చదివి అతని కలంలో వాస్తవాల సిరా నింపి, రచనలు చేస్తున్నారు రాజేష్ గారు ఆలోచనలతో యుద్ధం చేస్తూ భావ కవిత్వాలు కొందరు రాస్తే, ప్రస్తుత సమాజంతో రణం చేస్తూ వాస్తవాలు రచించేది మరికొందరు అలాంటి కోవకు చెందిన వారే రాజేష్ గారు, ఆయన అధికారం, పరిణితి, ఆయనకు వన్నె తెచ్చేవే అని చెప్పవచ్చు, అధికారం చేతిలో ఉన్నా, సామాన్య మానవుడిలా, రచయితలా, కవనాలు లిఖిస్తూ నిజా నిజాలను చూపిస్తున్నారు….

 

ఇక కవిత్వ విషయానికి వస్తే

******

నిగ్రహాన్ని..!!

******

పర్వతంలో కూరుకుపోయిన శిలను కాను

ప్రవహించే నదిలో గరక పోస్తే లేచిన కలను నేను

కదల లేని స్థితిలో ఉన్న మైనపు విగ్రహాన్ని కాదు

కలవరపడి స్పందించే మనసున్న నిగ్రహాన్ని నేను..!!

 

స్వార్థపు కోరల్లో అరాచక లోగిల్లో శిధిల ముక్కను కాను

కాల్చినా, సుగంధ సువాసనలిచ్చే గంధపు చెక్కను నేను

ప్రతిభ లేక నలుగురి ముందు నిలబడని పిరికిని కాను

అవధుల్లేని హృదయోల్లాసమున్న మెరికను నేను..!

 

కష్టాల రుచి ఎంత చూపించినా, కల్పితల మసి ఎంత పూసినా

అసత్యాల చీకటిలోయలో తోసి వదిలేసినా

వాస్తవమనే అగ్గిపెట్టె నాతోనే ఉంది ప్రాణానికి తోడుగా వెలిగిస్తూ ముందుకెళ్తా పడి లేచిన కెరటమై చీకటి దాటి..!

 

వసుధైక కుటుంబంలో సత్యమే చిరంజీవి ఎన్నటికైనా

వంచించే సమాజంలో శీలమే మూలధనం ఎప్పటికైనా

సంకల్ప బలం ముందు తలదించుడే ఎవరెస్ట్ అయినా

నిగ్గుతేల్చే నిజం ముందు తలవంచుడే ఎవరైనా..!

 

విచక్షణ లేని అధికార ఔన్నత్యం ఆహుతవును ఎన్నటికైనా

మేక వన్నెపులుల ఆర్భాటం అంతమవును ఎప్పటికైనా

చుట్టూ మొలిచిన మోసాల మొక్కలు దహించక మానవెప్పటికైనా

నలుగురు మెచ్చే స్వభావమే దారి చూపిస్తుంది ఎవరికైనా…!!!

 

రచయిత : రాజేష్

 

జీవచ్చవంలా పడి ఉన్నా శిలను కాను, కదలలేని స్థితిలో ఉన్న మైనపు విగ్రహాన్ని కాను, నిశ్చలత్వాన్ని అణువణువు నింపుకున్న కలను నేను, ఆటంకాలు ఎదురైతే ఎదురు తిరిగి ప్రశ్నించే మనసున్న నిగ్రహాన్ని నేను,

అంటున్నారు రచయిత…

 

స్వార్థాలు, గర్వాలు నిండిపోయిన ఈ సమాజంలో శిథిలంలా పడిలేను నేను, గంధపు చెక్కలా వెదికి ఆహుతి అవుతూ మంచి సువాసనను ఇస్తూ నన్ను నేను అంకితం చేస్తున్నాను,

ప్రతిభ లేక నలుగురి ముందు నిలబడని పిరికిని కాను, స్వచ్ఛంగా, స్వేచ్ఛగా అవధులే లేకుండా హృదయాన్ని ఉల్లాసంగా ఉంచుకుంటాను నేను అంటూ దేని ముందు మనం తక్కువ కాకూడదు, హృదయ స్పందన ఉన్నంతకాలం నువ్వు కూడా ఒక వజ్రమే అంటూ చెప్పకనే చెప్పారు….

 

కష్టాలు ,కల్పితాలు ,అసత్యాలు, మనిషి జీవితాన్ని నాశనం చేయడానికి ముందుగా ఉంటాయి, అలాంటి వాటిని కూడా లెక్కచేయకుండా అగ్నిలా వెలుగుతూ ముందుకు అడుగేస్తా కారు చీకటిని సైతం దహించి వేస్తాను అంటూ ఎంతో ఔన్నత్యంగా, నిగర్వంగా చెప్పారు రచయిత…

 

ఈ వసుదైక కుటుంబంలో సత్యమే శాశ్వతం, మోసం చేసే సమాజంలో శీలమే మూలధనం, సంకల్ప బలం ఉంటే ఎవరెస్ట్ అయినా నీ ముందు తలదించక తప్పదు, నువ్వు నిజాయితీగా ఉంటే నీ ముందు ఎవరైనా తలదించుతారు అంటూ ఎంతో ప్రేరణాత్మకమైన సందేశాన్ని అందించారు కవి..

 

విచక్షణ లేకుండా అధికారాన్ని స్వీకరిస్తే అది ఏ క్షణానైనా నాశనం అవుతుందని, మేక వన్నె పులులులా జీవనం సాగిస్తే ఆ ఆర్భాటం ఎప్పటికైనా అంతమవుతుందని,

మోసాలు ఎంత విజృంభిస్తే అంతకు అంత ఆహుతవుతాయని,

మన స్వభావం, మన ఆలోచన తీరు, ఒకరితో నడుచుకునే విధానమే మనకు భవిష్యత్తు చూపిస్తుందని, నలుగురిలో గౌరవము లభిస్తుందని, ఎంతో విప్లవాత్మకంగా, వినసొంపుగా, విశదీకరించి వివరించారు రచయిత…

 

నిజమే మన నడవడికే మన భవిష్యత్తుకు మార్గమవుతుంది, మన ఆలోచన నలుగురు మనతో ఉండేలా చేస్తుంది, ఏదైనా సరే నువ్వు ఇచ్చే దానినుంచే స్వీకరించడం జరుగుతుంది అంటూ సత్యాలను చెప్పారు…

 

ఇలానే మీరు మరెన్నో రచనలు చేస్తూ, సమాజ మార్పు కోసం, యువత భవిష్యత్తు కోసం, పాటుపడాలని, మీ కవనాల వలన ఇంకా ఎంతోమంది ఆలోచనలు మారి, మంచి మార్గం వైపు నడవాలని, ఎందరికో మీరు ఆదర్శంగా నిలబడాలని, మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను…

 

సమీక్షకురాలు : పోలగాని భాను తేజశ్రీ

Related posts

ప్రేమ పరీక్ష

TNR NEWS

మాయమైపోతున్నాడు…మనిషి

శీర్షిక : పెళ్లి

Dr Suneelkumar Yandra

ఆగని మారణహోమం – రాజకీయం

అబద్ధపు జీవనాలు – మారుతున్న స్థితిగతులు

Dr Suneelkumar Yandra