- జనసేన కార్యాలయాలపై పార్టీ జెండా అవనతం
మంగళగిరి : జమ్ము కాశ్మీర్ లోని బైసరన్ ప్రాంతంలో పర్యాటకులపై ఉగ్రవాదులు దాడి చేసి 28 మందిని హతమార్చడాన్ని జనసేన పార్టీ తీవ్రంగా ఖండిస్తోంది. పార్టీ అధ్యక్షు డు పవన్ కల్యాణ్ ఈ దుశ్చర్యను ఖండించి, మృతులకు సంతాపం తెలియచేశారు. జనసేన పార్టీ పక్షాన మృతులకు సంతాపం తెలియచేస్తూ మూడు రోజులపాటు సంతాప కార్యక్రమాలు నిర్వహించాలని పవన్ కల్యాణ్ దిశానిర్దేశం చేశారు. బుధవారం ఉదయం అన్ని పార్టీ కార్యాలయాలపై పార్టీ జెండాను అవనతం చేస్తూ సగం వరకూ దించి ఉంచాలని స్పష్టం చేశారు. సాయంత్రం కూడళ్లలో కొవ్వొత్తులు వెలిగించాలని, శుక్రవారం సాయంత్రం రాష్ట్రవ్యాప్తంగా మానవ హారాలు నిర్వహించి ఉగ్రవాద దాడిని ఖండించాలని తెలియచేశారు.
- మంగళగిరి పార్టీ కేంద్ర కార్యాలయంలో జనసేన పతాకాన్ని అవనతం
జమ్ము కాశ్మీర్ లోని బైసారన్ దగ్గర పర్యాటకులపై ఉగ్రవాదులు తెగబడి 28 మందిని కాల్చివేయడాన్ని ఖండిస్తూ జనసేన పార్టీ మూడు రోజులపాటు సంతాప దినాలు పాటిస్తోంది. ఇందులో భాగంగా బుధవారం ఉదయం మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో జనసేన పతాకాన్ని అవనతం చేశారు. ఈ కార్యక్రమంలో శాసన మండలిలో ప్రభుత్వ విప్ పిడుగు హరిప్రసాద్, నెల్లిమర్ల ఎమ్మెల్యే లోకం నాగ మాధవి, ఏపీఎంఎస్ఐడిసి ఛైర్మన్ చిల్లపల్లి శ్రీనివాస్, పార్టీ రాష్ట్ర కార్యదర్శులు అమ్మిశెట్టి వాసు, మండలి రాజేష్, సంయుక్త కార్యదర్శి బేతపూడి విజయశేఖర్, పార్టీ నేతలు గంజి చిరంజీవి, జె.రాజారెడ్డి తదితరులు పాల్గొన్నారు.