సూర్యాపేట: రానున్న మున్సిపల్ ఎన్నికల్లో ప్రజా సమస్యలపై నిరంతరం పోరాడే సిపిఎం అభ్యర్థులను గెలిపించాలని సిపిఎం జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జున రెడ్డి ప్రజలకు పిలుపునిచ్చారు. శనివారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని మల్లు వెంకట నరసింహారెడ్డి భవన్ లో జరిగిన సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గం సమావేశంలో ఆయన మాట్లాడుతూ రానున్న మున్సిపల్ ఎన్నికల్లో నిరంతరం ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఉద్యమాలు నిర్వహించే సిపిఎం అభ్యర్థులను గెలిపించాలని కోరారు. సిపిఎం అభ్యర్థులు గెలిస్తే ప్రజా సమస్యలపై మున్సిపల్ కౌన్సిల్ లో పోరాటం చేస్తారని, వార్డులలో నెలకొన్న సమస్యల పరిష్కారం కోసం పాలకవర్గంపై ఒత్తిడి తీసుకువచ్చి వార్డుల అభివృద్ధికి కృషి చేస్తారని అన్నారు. ఎలాంటి అవినీతి లేకుండా సుపరిపాలన కమ్యూనిస్టులు అందిస్తారని అన్నారు. గతంలో సిపిఎం తరపున ఎన్నికైన కౌన్సిలర్ లు నీతిగా, నిజాయితీగా పాలన కొనసాగించారని గుర్తు చేశారు. ఈ ఎన్నికల్లో కలిసివచ్చే లౌకిక పార్టీలను కలుపుకొని 5 మున్సిపాలిటీలలో పోటీ చేస్తామన్నారు. పార్టీ కార్యకర్తలు మున్సిపల్ ఎన్నికలకు సిద్ధం కావాలని కోరారు. సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు పారేపల్లి శేఖర్ రావు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు నెమ్మాది వెంకటేశ్వర్లు, కొలిశెట్టి యాదగిరిరావు, సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు నాగారపు పాండు, మట్టి పెళ్లి సైదులు, చెరుకు ఏకలక్ష్మి పాల్గొన్నారు.
