తెలంగాణ రాష్ట్రంలో ఒకపక్క చలి తీవ్రత పెరిగి చలిగాలులు వీస్తున్న సమయంలో మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని జిల్లాలలో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది.
నైరుతి బంగాళాఖాతంలోని తీవ్రవాయుగుండం నెమ్మదిగా కదులుతోందని, గడచిన ఆరు గంటల్లో గంటకు రెండు కిలోమీటర్ల వేగంతో కదులుతోందని ఐఎండి పేర్కొంది.
*తుఫానుగా తీవ్ర వాయుగుండం*
చెన్నైకి 480 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైన ఈ తీవ్రవాయుగుండం రాగల 12 గంటలలో శ్రీలంక తీరాన్ని దాటి ఉత్తర వాయువ్య దిశగా పయనం అవుతుందని భారత వాతావరణ శాఖ అంచనా వేసింది. ఈ తీవ్ర వాయుగుండం రేపు ఉదయం తుఫానుగా మారే అవకాశం ఉందని తమిళనాడు పుదుచ్చేరి తీరాల సమీపంలో నవంబర్ 30వ తేదీ ఉదయం మహాబలిపురం కారైకల్ మధ్య తీరం దాటే అవకాశం ఉందని తాజా బులెటిన్లో వెల్లడించింది.
*మూడు రోజులపాటు వర్షాలు*
దీంతో తెలంగాణ రాష్ట్రంలో పలు జిల్లాలలో నవంబర్ 30 తేదీ నుంచి డిసెంబర్ రెండవ తేదీ వరకు ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. అయితే రేపటి నుంచి పలు జిల్లాలలో వర్షాలు కురుస్తాయని చెప్పిన వాతావరణ కేంద్రం వర్షాలు కురిసే జిల్లాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.
*రేపు ఈ జిల్లాలలో వర్షాలు*
తుఫాను ప్రభావంతో నవంబర్ 30వ తేదీన కొత్తగూడెం, ఖమ్మం, సూర్యాపేట, నల్గొండ, నాగర్ కర్నూల్, గద్వాల, వనపర్తి జిల్లాలలో ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఈ జిల్లాలకు ఎల్లో హెచ్చరికలను జారీ చేసింది హైదరాబాద్ వాతావరణ కేంద్రం.
*డిసెంబర్ 1న ఈ జిల్లాలకు వర్ష సూచన*
ఇక డిసెంబర్ ఒకటవ తేదీన తెలంగాణ రాష్ట్రంలోని ములుగు, భూపాలపల్లి, ఖమ్మం, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, జనగాం, నాగర్ కర్నూల్, వనపర్తి, గద్వాల, కొత్తగూడెం జిల్లాలలో ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని, డిసెంబర్ ఒకటవ తేదీ కూడా ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది.
*డిసెంబర్ 2న ఈ జిల్లాలకు ఎల్లో అలెర్ట్*
డిసెంబర్ రెండవ తేదీన తెలంగాణ రాష్ట్రంలోని వరంగల్, హనుమకొండ, భూపాలపల్లి, ములుగు, జనగామ, సిద్దిపేట, కొత్తగూడెం జిల్లాలలో వర్షాలు కురిసే అవకాశం ఉందని ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఆపై డిసెంబర్ 3, 4 తేదీలలో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని అయితే దీనిపై ఎటువంటి హెచ్చరికలు లేవని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.