పిఠాపురం : ఆధ్యాత్మిక కేంద్రంగా పిఠాపురం నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసి చూపిస్తానని పిఠాపురం పట్టణం ఉప్పాడ బస్టాండ్‌లో జరిగిన వారాహి బహిరంగ సభలో పిఠాపురం ఎమ్మెల్యే, రాష్ట్ర ఉపముఖ్యమంత్రి కొణిదల పవన్ కళ్యాణ్ అన్నారు. కానీ నేడు అభివృద్ధి మాట అటువుంచితే… వున్న అధికారుల నిర్లక్ష్యానికి పిఠాపురం పట్టణం చెత్తతో కంపు మయంగా మారింది అనడంలో అతిశయోక్తిలేదు. పట్టణ శానిటేషన్ సిబ్బంది నిద్రావస్థలో వుందన్న చందంగా కనిపిస్తుంది. నిత్యం పట్టణాన్ని ఉదయాన్నే శుభ్రపరచే శానిటేషన్ అధికారులు, సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా చెత్త పేరుకుపోవడంతో పట్టణ ప్రజలు దుర్వాసనతో ఇబ్బందులు పడుతూ.. రోగాల బారిన పడుతున్నారు. స్థానిక పల్లపువీధి రామాలయం వద్ద మున్సిపల్ అధికారులు చెత్తవేసేందుకు ఏర్పాటుచేసిన డస్ట్‌బిన్‌లో నిత్యం చెత్త పేరుకుపోతునే వుంటుంది తప్ప దాన్ని తీసి డంపింగ్ యార్డుకి తరలించడంలేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అసలే రోడ్డు ఇరుకు ఆపై చెత్త పడవేసేందుకు ట్రాన్స్‌ఫారం వద్ద ఏర్పాటు చేసిన డస్ట్‌బిన్ రోడ్డుపై పెట్టడంతో వాహనాదారులకు కూడా ఇబ్బందికరంగా మారి, నిత్యం ట్రాఫిక్ స్థంభిస్తుంది. పిఠాపురం నియోజకవర్గంలో అధికారులకు ప్రజలు ఎన్నిసార్లు పిర్యాధులు చేసినా పట్టించుకున్న దాఖలాలు లేవు. దీనిపై స్థానిక ఎమ్మెల్యే, రాష్ట్ర ఉపముఖ్యమంత్రి కొణిదల పవన్ కళ్యాణ్ ప్రత్యేక దృష్టి పెట్టాని ప్రజలు కోరుతున్నారు.