కాకినాడ : 159 సంవత్సరాల కాకినాడ నగర పాలక సంస్థలో పదేళ్ల పాటు (1982-1992) మున్సిపల్ చైర్మన్ గా కొనసాగిన జ్యోతుల సీతారామమూర్తి అందించిన పౌర సేవలను ఎవరూ మరువలేరు. గ్రేటర్ విజన్ గా ఆనాడే భవిష్యత్ త్రాగునీరు అవసరాల కోసం అత్యధిక ప్రాధాన్యత ఇచ్చారు. బ్లాక్ బోర్డు పథకాన్ని వినియోగించి ప్రతి పేటకు ఓ ప్రాథమిక స్కూల్ నిర్మాణం చేయించారు. పారిశ్రామిక సంస్థ నిలిపిన అభ్యర్థి అయినా ప్రజాపాలనలో రాజీలేని వైఖరి కొనసాగించారు. జాతీయ, ప్రాంతీయ వామపక్ష పార్టీలు ఏవైనా వారి అజెండా ప్రజలకు మేలు చేసే ప్రణాళిక వుంటే అడ్డు చెప్పే వారు కాదు. ఆయన హయాంలో వంద మందికి పైగా సాధారణ పౌరులకు మున్సిపాలిటీలో ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించారు. దివంగత లోక్ సభ స్పీకర్ గంటి మోహన చంద్ర బాలయోగి అప్పట్లో జిల్లా పరిషత్ చైర్మన్ గా వుండేవారు. ఆయనతో బాటుగా జిల్లా సహకార సంస్థ చైర్మన్ గా ఆకాశం శ్రీరామ చంద్ర మూర్తి వుండేవారు. వారిరువురూ కాకినాడ కేంద్రంలో జ్యోతుల సీతారామ మూర్తి లేకుండా ఎక్కడికీ వెళ్ళే వారు కాదు. వారు ముగ్గురు అప్పటి రాజకీయాల్లో జిల్లా త్రిమూర్తులుగా వెలిగారు. కాకినాడ ఎంపీ దివంగత తోట సుబ్బరావుతో దగ్గరగా వుండేవారు. ఓవర్ హెడ్ ట్యాంక్స్ ఏర్పాటు కోసం ఎంపి నిధులను వినియోగించేవారు. ఆయన పనిచేసిన పదేళ్ల కాలంలో పట్టణ ఎమ్మెల్యేగా ముత్తా గోపాలకృష్ణ అద్భుత విజనరీగా కాకినాడను తీర్చిదిద్దారు. కౌన్సిల్ లో వర్గాల ఆధిపత్యం వున్నా అభివృద్ధికి మాత్రమే వారిరువురూ ప్రాధాన్యత ఇచ్చేవారు. అందుకే అనేక కార్యక్రమాల్లో కృష్ణార్జునులుగా పిలిచేవారు. కాకినాడ ఎంపిగా యు.వి.కృష్ణంరాజు పోటీ చేసినప్పుడు ముందుగా మొదటి అడుగు వేసి ముందడుగు వేయించారు. రాజకీయాల్లోకి కొత్తగా వచ్చిన ఎమ్మెల్యే వనమాడి వేంకటేశ్వరరావుకు పట్టణం నలుమూలలా తన సామర్థ్యాన్ని అండగా నిలిపే సహకారం అందించారు. వ్యవసాయ పారిశ్రామిక ఫల పుష్ప ప్రదర్శన ఎగ్జిబిషన్ నిర్వహణను కుళాయి చెరువు ఆవరణలో పెద్దఎత్తున ప్రతిష్టాత్మకంగా నిర్వహణ చేయించేవారు. ప్రతి వార్డుకు రీడింగ్ రూమ్ ఏర్పాటు చేయడానికి పాటుపడ్డారు. రెడ్ క్రాస్ రాష్ట్ర చైర్మన్ వై.డి.రామారావు అభివృద్ధి చేసిన సూపర్ బజార్ ప్రగతికి దోహదపడ్డారు. ఆనంద భారతి ఏర్పాటుకు ప్రాధాన్యత ఇచ్చారు. పారిశుద్ధ్య కార్మికులకు ప్రత్యేక ప్రాధాన్యత ఇచ్చి కాలనీలు గృహాలు విద్య వైద్యం నిర్వహణకు ఉద్యమాల నేపథ్యంలో సంఘీభావంగా వుండేవారు. రామకృష్ణా సేవాసమితికి ఆశ్రయం ఇచ్చారు. వినియోగదారుల ఉద్యమంలో దివంగత పి.ఎస్.ఆర్.కె.తిమ్మాజీ రావు, యువకుడు హెచ్.ఎస్.రామకృష్ణ వంటి వారికి వెల్ విషర్ గా వుండేవారు. జవహర్ ఆలీ వంటి న్యాయవాదులకు తోడుగా నిలిచేవారు. దివంగత తటవర్తి శ్రీనివాసరావు వంటి మహర్షి సాంబమూర్తి సేవలకు అండగా వున్నారు. మున్సిపాలిటీకి రెండు సార్లు సావనీర్ ముద్రించి పారదర్శకంగా నిలిచారు. ఇంద్రపాలెం లాకుల వద్ద కలెక్టరేట్ రోడ్ లో డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ విగ్రహం, గాంధీనగర్ రోడ్ లో బాబూ జగ్జీవన్ రామ్ విగ్రహం ఏర్పాటైన ఘనత ఆయనకే దక్కింది. ప్రముఖ సినీ నిర్మాత కొండా కృష్ణంరాజు నిలిపిన ఎన్.టి.ఆర్ దుర్యోధన పాత్ర విగ్రహం ఒక అధ్యాయం అయితే.. బ్రహ్మసమాజం ఓం తత్సత్ పరిరక్షణ వెంకట్ నగర్ లో వేంకటేశ్వర స్వామి ఆలయ దేవస్థానం నిర్మాణం మరొక విశేషం. దడాల సుబ్బారావు, కిర్ల కృష్ణారావు కాటా తక్కెడలో రెండు ప్లేట్లుగా వున్నా వారిని సమతూకంలో ప్రజాహితం కోసం తనకు అండగా చేసుకుని ప్రజా ప్రయోజనాలు నెరవేర్చేవారు. బొగ్గవరపు డాక్టర్ సేవలకు ధ్వజస్థంభంగా నిలిచారు. ఏ రాజకీయ పార్టీ వారైనా కౌన్సిలర్లు, కార్పొరేటర్లు ఎవరైనా మా గురువు గారు అంటూ పిలిపించుకున్న జ్యోతుల అందరివాడుగా నిలిచేవారు. స్వాతంత్ర్య సమర యోధుడుగా సి.వి.కె.రావు, మంత్రిగా పంతం పద్మనాభం, ప్రజాహితుడిగా బి.వి.ఎస్.పాత్రుడు, హిందూ, ముస్లిం, క్రైస్తవ సమాఖ్య అలహజ్ కె.దుర్రాని, ప్రభుత్వ కార్యదర్శి కె.ఎస్.ఎన్.మూర్తి వంటి వారి సలహాలు స్వీకరించేవారు. ఎస్ఎఫ్ఐ, పి.డి.ఎస్.యు వంటి విద్యార్థి సంఘాలకు ఆవేశ రహిత ఆలోచనలు ఇచ్చి వారి కార్యక్రమాలకు భుజం తట్టేవారు. మాజీ మంత్రి మల్లాడి స్వామి, మాజీ కేంద్రమంత్రి మల్లిపూడి శ్రీరామ సంజీవ రావు మంగపతి పళ్ళంరాజుతో కలిసి కాకినాడ సౌకర్యాల పెంపుకు దోహదం అయ్యేవారు. దివంగత తొలి మహిళా చైర్ పర్సన్ కె.ఇ.ప్రభా జోసెఫ్, పురపాలక ఆఖరి చైర్మన్ బీరక చంద్ర శేఖర్ హయాంలో అనేక విషయాల్లో సలహాలు సూచనలతో సదా సహకరించేవారు. అప్పటి రాజ్యసభ సభ్యురాలు వంగా గీతా విశ్వనాథ్, ఎమ్మెల్సీ యెనుముల సావిత్రీదేవి, గాదం కమలా దేవీ, ప్రముఖ డాక్టర్ ఆలూరి విజయలక్ష్మి, ఐ.వి.రావు, పి.వి.ఎన్.రాజు, చిరంజీవిని కుమారి, కొమ్మిరెడ్డి వీరభద్రరావు వంటి దిగ్గజాలు వారి సలహాలు పొందేవారు. చామకూర నాగబాబు, కోమలి వెంకట్రావు, చార్మినార్ రాజు, దండు మహాంతి, పైలా రామకృష్ణ, సకల సోమరాజు, ఇనుకొండ పట్టాభిరామయ్య, ఇంటి సత్యనారాయణ, కంపర రమేష్, ఎస్.కె.బాబులు, చోడిపల్లి సత్య ప్రసాద్ వంటి వారు ఆత్మీయంగా పలకరించి ఆయన నుండి సలహాలు పొందేవారు. కౌన్సిల్ రికార్డర్ సూరిబాబు, కారుడ్రైవర్ బాబూరావు అన్నింటా ఆయన వెంట వుండటానికి ఇష్టపడేవారు. ఆయన పెద్దకుమారుడు మిలటరీలో మేజర్ గా ఉన్నత స్థానం పొందారు. ఉద్యోగ వ్యాపార కార్మిక శ్రామిక హిందూ ముస్లిం క్రైస్తవ బౌధ్ధ మున్నగు అన్ని మతాల పెద్దలతో వివిధ కులాల నాయకులతో ప్రతి మీటింగ్ లో జ్యోతిలా వెలిగారు. రాజకీయాల్లో స్థాయికి తగ్గ అవకాశాలు లేకపోయినా అడ్డగోలు అవకాశాల కోసం వెంపర్లాడలేదు. డబ్బు రాజకీయాలు నేర్వలేదు. ఓ దశలో పోటీ చేయడానికి తన స్థాయికి తగ్గ స్థానం కాకపోయినా ప్రజలు గుర్తించకపోయినా మనస్తాపం చెందలేదు. తెలుగుదేశం, కాంగ్రెస్, బిజెపి పార్టీల్లో క్రియాశీలకంగా పనిచేసారు. కమ్యూనిస్ట్ ఉద్యమాల్లో ప్రధానంగా మార్క్సిస్టు కార్యక్రమాల్లో నిలిచేవారు. ఆయన శ్రీమతి గృహలక్ష్మికి తన అంతిమ దశలో అన్ని సేవలు చేయడానికి ప్రాధాన్యం ఇచ్చేవారు. కరోనాను అధిగమించారు.. కానీ ఆ విపత్తు కరిగించిన ఆయన ఆరోగ్యాన్ని దెబ్బతీసింది. అటువంటి దశలో దడాల సుబ్బారావు వారిని కలిశారు. ఆ విషయం ఆయన నాకు చెప్పారు. ఒక సారి వెళ్లి కలు. బాగా వంగి పోయాడు. నేనే ఆశ్చర్యపోయాను సీతారామ మూర్తిని గుర్తుపట్టలేక పోయాను రమణ రాజు అని నాకు నొక్కి చెప్పారు. వెళదామని అనుకున్నాను. అంతలోనే ఆయన కాలం చేశారని వార్త తెలిసింది. ఆయన భౌతిక దేహాన్ని చూసి చలించి ఆఖరి ఫోటోగా ఫైల్ చేసుకుని ప్రెస్ కి సమాచారం ఇచ్చాను. ప్రతి పత్రికా ఆయన గురించి జ్యోతుల ఇక లేరన్న వార్తను వెలుగులోకి తెచ్చారు. విజ్జపు రెడ్డి హిందూ స్మశాన వాటికలో వారి కుటుంబంతో టిక్కు పోతుల విశ్వం వంటి ప్రముఖులు వెన్నంటి ఉండి ఆయన అంత్యక్రియలు దగ్గరుండి పూర్తి చేయించారు. పారిశ్రామిక దిగ్గజం ఎస్ఆర్ఎంటి కె.వి.ఆర్ చౌదరి నిలిపిన చైర్మన్ గా జ్యోతుల ముందుకు వచ్చి ప్రజల్లో తన కంటూ ప్రత్యేక స్థానాన్ని పొందుపర్చుకుని ఒదిగిపోయారు. చివరి వరకూ అదే అభిమానంతో నిలిచిపోయారు. గత ఏడాది తేదీ ప్రకారం ఏప్రిల్ లో వర్ధంతి సభ జరిగింది. నగర ప్రముఖులు ఆయన కాంస్య విగ్రహాన్ని కాకినాడ నగరంలో కార్పోరేషన్ గౌరవార్థంగా నిలపాలని తీర్మానించారు. భవిష్యత్ కాలంలో జాప్యం లేకుండా జ్యోతుల సీతారామ మూర్తి విగ్రహాన్ని కాకినాడ నగర పాలక సంస్థ నిలుపుతుందని ఆశిద్దాం. ఉమ్మడి ఎపిలో రాష్ట్ర మున్సిపల్ చైర్మన్స్ ఛాంబర్ కార్యదర్శిగా ఆయన అన్ని రాజకీయ పార్టీల వారికి మున్సిపల్ గైడ్ గా సుపరిచితులవ్వడం విశేషమైన విషయం.
వ్యాసకర్త:
దూసర్లపూడి రమణరాజు
సామాజిక వేత్త
(2002 ఎపి ప్రభుత్వ అవార్డు గ్రహీత)
కన్వీనర్ పౌరసంక్షేమ సంఘం 9949146999