- న భూతో అనేలా జయకేతనం ఆవిర్భావ సభ
- 1600 మంది పోలీసులతో భారీగా బందోబస్తు
- రాష్ట్రం నలు వైపుల నుంచి వచ్చే వారికి ప్రత్యేక ఏర్పాట్లు
- ఆహారం, మంచినీరు అందరికీ అందేలా చర్యలు
- సభా స్థలంలో 12 అంబులెన్సులు, మెడికల్ బృందాలు సిద్ధం
- మహిళలకు ప్రత్యేక గ్యాలరీలు, సౌకర్యాలు
- శుక్రవారం సాయంత్రం 3.30 గంటల నుంచి సభ మొదలు
- తుది దశకు వచ్చిన ఆవిర్భావ సభ ఏర్పాట్లను పరిశీలించి, వివిధ కమిటీల నాయకులు, రాష్ట్ర నాయకులతో ప్రత్యేకంగా సమావేశం నిర్వహించిన పీఏసీ చైర్మన్, మంత్రి నాదెండ్ల మనోహర్
పిఠాపురం : పిఠాపురం జనసేన పార్టీకి ఎన్నో మరుపురాని జ్ఞాపకాలు ఇచ్చింది. జనసేన పార్టీ 12వ ఆవిర్భావ దినోత్సవం జయకేతనం సభకు కూడా పిఠాపురం వేదిక అయింది. ఈ సందర్భంగా పిఠాపురం ప్రజలకు నిండు మనసుతో కృతజ్ఞతలు చెప్పుకొందాం.. థాంక్యూ పిఠాపురం అని జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్, రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు. గతంలో ఎన్నడూ లేనంతగా పిఠాపురంలో జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని న భూతో అన్న రీతిలో నిర్వహిస్తున్నామని, దీనికి పార్టీలోని ప్రతి ఒక్కరూ మమేకం కావాలని పిలుపునిచ్చారు. జనసిన పార్టీ ఆవిర్భావ దినోత్సవం “జయ కేతనం” సభ ఏర్పాట్లను బుధవారం సాయంత్రం నాదెండ్ల మనోహర్ పరిశీలించారు. ఆసాంతం పరిశీలించి తగు సూచనలు అందించారు. సభా ప్రాంగణం మొత్తం కలియ తిరిగి ఏ ఏ ప్రాంతాల్లో ఎలాంటి ఏర్పాట్లు ఉన్నాయో అడిగి తెలుసుకున్నారు. ఏ కమిటీ ఎలా పని చేయాలి? ఎక్కడ పని చేయాలి అన్న వివరాలను సైతం అడిగి తెలుసుకున్నారు. కమిటీల సభ్యులకు తగు సూచనలు అందించారు. అనంతరం సభా ప్రాంగణంలోనే నాదెండ్ల మనోహర్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మనోహర్ మాట్లాడుతూ గతంలో ఆవిర్భావ సభ జరిపినప్పుడు బందోబస్తు కోసం కోరితే పోలీస్ శాఖ పై నుంచి వచ్చిన ఆదేశాల మేరకు అంతంత మాత్రమే స్పందించేది. ఇప్పుడు ఆవిర్భావ సభ కోసం ఏకంగా 1600 మంది పోలీసులు బందోబస్తు కోసం రావడం శుభ సూచకం. కేవలం పిఠాపురం నుంచే కాకుండా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా నుంచి, రాష్ట్రంలోని నలువైపుల నుంచి, ఇతర రాష్ట్రాల నుంచి కూడా భారీగా జన సైనికులు, వీర మహిళలు తరలివచ్చే అవకాశం ఉంది. వారికి తగినంతగా మనం ఏర్పాట్లు చేయాల్సిన అవసరం ఉంది. దీనికి పార్టీ తరఫున నియమించిన కమిటీలు ఎప్పటికి అప్పుడు సమన్వయంతో పని చేయాల్సిన అవసరం ఉంది.
- మనమంతా నాయకుడికి నిండు మనసుతో కృతజ్ఞత చెప్పుకోవాలి
జనసేన పార్టీ ప్రస్థానంలో పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఎదుర్కొన్న అవమానాలు, అవరోధాలు దాటి ఇప్పుడు ఇంత ఘనమైన పండుగ నిర్వహించుకుంటున్నామంటే మనమంతా నాయకుడికి కృతజ్ఞులై ఉండాలి. ఆయన మనకు సమాజంలో తీసుకొచ్చిన గౌరవం, పార్టీ ద్వారా ఆయన ఆశయాలకు తోడు నిలవడం మనకు ఓ మధురానుభూతి. దీనికి మనం ఎల్లవేళలా పవన్ కళ్యాణ్ కి ధన్యవాదాలు తెలుపుతూనే ఉండాలి. అధికారం లేనప్పుడు ప్రజల కోసం ఎలా పోరాటాలు చేశారో అధికారంలో ఉన్నప్పుడు కూడా పవన్ కళ్యాణ్ ప్రజల కోసం అంతే తపిస్తున్నారు. తన పరిధిలో ఉన్న శాఖల ద్వారా విశేషంగా ప్రజలకు సేవలు అందించాలని పాలన సాగిస్తున్నారు. ఓ గొప్ప పోరాటం తాలూకా ఫలితం తర్వాత వచ్చిన గొప్ప సమయం ఇది. దీన్ని మనమంతా ఉత్సవంలా జరుపుకుందాం. మచిలీపట్నం తర్వాత నిర్వహించిన అతి పెద్ద సభగా ఇది నిలుస్తుంది. దేశంలో ఇప్పటి వరకు ఏ పార్టీ కూడా నిర్వహించనంత ఘనంగా జయ కేతనం సభ ఉండబోతోంది. ఇది మనమంతా గర్వించదగ్గ సమయం.
- ఎండ పెరుగుతోంది జాగ్రత్త
జిల్లా కలెక్టర్ సగిలి షన్మోహన్, ఎస్పీ బిందు మాధవ్ ఇప్పుడే మారుతున్న వాతావరణం తాలూకా హెచ్చరికలు తెలిపారు. ఎండలు బాగా పెరుగుతున్న దృష్ట్యా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. దీనికి మనం కూడా సిద్ధంగా ఉండాలి. దూర ప్రాంతాల నుంచి వచ్చే వారికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూసుకోవాలి. ప్రత్యేకంగా మెడికల్ కమిటీ ఏర్పాటు చేశాం. దీంతోపాటు మెడికల్ సిబ్బంది కూడా సభా స్థలంలో సిద్ధంగా ఉండాలి. మొత్తం 12 అంబులెన్సులను సిద్ధంగా ఉంచాం. అలాగే చుట్టుపక్కల ఆసుపత్రిల సిబ్బంది నిరంతరం అందుబాటులో ఉండేలా సూచనలు చేశాం. సభా స్థలంలో ఎవరికి ఎలాంటి అస్వస్థత చేకూరిన వెంటనే స్పందించేలా మన వాలంటీర్లు సదాసిద్ధంగా ఉండాలి. దీంతోపాటు సభకు వచ్చేవారికి మంచినీళ్ల ప్యాకెట్లు, మజ్జిగ ప్యాకెట్లు, పుచ్చకాయలు కూడా ఇచ్చే ఏర్పాటు చేస్తున్నాం. లక్షల్లో బిస్కెట్ ప్యాకెట్లు సిద్ధంగా ఉన్నాయి. అలాగే భోజన ఏర్పాట్లను నాయకులు విరివిగా చేయడం అభినందనీయం. సభకు వచ్చిన వారెవరు ఆకలి లేదా దాహంతో వెళ్లకుండా తగిన ఏర్పాట్లు చేయడం అభినందనీయం. దీనిని సభ రోజు కచ్చితంగా అమలు అయ్యేలా చూసుకోవాలి. ఏ కమిటీకి ఇచ్చిన బాధ్యత ఆ కమిటీ కచ్చితంగా నిర్వహించాలి.
- పార్కింగ్ స్థలాలు, గ్యాలరీలు ప్రత్యేకంగా…
ఎటువైపు నుంచి సభకు వచ్చే వారికి అటు వైపుగా ప్రత్యేకంగా పార్కింగ్ స్థలాలను కేటాయించాం. అలాగే ప్రత్యేకంగా గ్యాలరీలు ఉన్నాయి. మహిళలకు ప్రత్యేకంగా గ్యాలరీలు, సౌకర్యాలు కల్పించాం. సభా ప్రాంగణంలో పార్టీ తరపు నుంచి 75 సీసీ కెమెరాలు ఏర్పాటు చేశాం. ఎక్కడా ఎలాంటి అవాంతరం లేకుండా సభ జరిగేలా ప్రతి ఒక్కరూ ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. మధ్యాహ్నం 3.30 గంటలకు సభ ప్రారంభమవుతుంది. వివిధ రకాల సంస్కృతులను ప్రతిబింబించేలా కల్చరల్ ప్రోగ్రామ్స్, ఒకరి తర్వాత ఒకరు నాయకుల ప్రసంగాలు, మధ్యలో ప్రత్యేకంగా తొమ్మిది ఆడియో, వీడియో పార్టీ ప్రస్థాన కథనాలు ఉంటాయి. అనంతరం పవన్ కళ్యాణ్ ప్రత్యేక ప్రసంగం ఉంటుంది. రోడ్డుకు నలువైపులా ఎల్ఈ డి స్క్రీన్లు, నాలుగు కిలోమీటర్ల మేర ఆడియో వినిపించేలా ప్రత్యేకంగా బాక్సులు ఏర్పాటు చేసాం. అలాగే ఈసారి ప్రత్యేకంగా బాణసంచా ఏర్పాట్లు కన్నుల విందుగా ఉండబోతున్నాయి. ఈ సభ ఇప్పటివరకు ఎవరూ జరపని అతిపెద్ద సభ. ప్రతి ఒక్కరు దీని విజయవంతం చేయడానికి పాటుపడదాం.
- వాలంటీర్ల సేవలు కీలకం
పార్టీకి మొదటి నుంచి వాలంటీర్ల సేవలు చాలా కీలకం. ఇప్పుడు కూడా వారి సేవలు ఎంతగానో ఉపయోగపడతాయి. పోరాట యాత్ర దగ్గర నుంచి వారాహి యాత్ర, తర్వాత జరిగిన ఆవిర్భావ సభల్లో పార్టీ వాలంటీర్లు చేసిన సేవలు విశేషమైనవి. ఇప్పుడు కూడా వాలంటీర్లు పోలీసులకు సహకరిస్తూ తగువిధంగా పనిచేయాలి. వాతావరణ మార్పులను దృష్టిలో పెట్టుకొని ఎక్కడ ఎలాంటి అపశృతి లేకుండా మెడికల్ బృందాలతో సమన్వయం చేసుకొని ముందుకు సాగాలి. గ్యాలరీల్లో అందరికీ తగిన ఆహారం నీరు అందేలా వాలంటీర్లు చొరవ తీసుకోవాలి. పోలీసులతో పూర్తిగా సమన్వయం చేసుకోవాలి. ఎవరికి ఇచ్చిన బాధ్యతలు వారు సక్రమంగా నిర్వహించాలి. అన్ని విభాగాలు సమన్వయం చేసుకోవడం ద్వారా ఎక్కడ ఎలాంటి అపశృతి లేకుండా సభ సజావుగా సాగడానికి వీలుంటుంది. వైసీపీకి చెందిన కార్యకర్తలు జనంలో చొరబడి అలజడి సృష్టించడానికి ప్రయత్నిస్తే వెంటనే పోలీసులకు అప్పగించేలా చూడండి. ఏ మాత్రం చిన్న అలజడి అయినా, వెంటనే స్పందించేలా వాలంటీర్లు పని చేయాలి.
- వాలంటీర్ల సేవలు వెన్నుదన్నుగా నిలుస్తాయి : ఎమ్మెల్సీ పిడుగు హరిప్రసాద్
వాలంటీర్లతో ప్రత్యేకంగా జరిగిన సమావేశంలో శాసనమండలిలో ప్రభుత్వ విప్, ఎమ్మెల్సీపిడుగు హరిప్రసాద్ మాట్లాడుతూ… పార్టీకి మొదటి నుంచి వాలంటీర్లు చేసిన సేవలు ఎనలేనివి. ఇప్పుడు అధికారంలో ఉన్న సమయంలో వాలంటీర్లు పోలీసులతో, వ్యవస్థతో సమన్వయం చేసుకొని ముందుకు సాగాలి. ఎక్కడ చట్టాన్ని చేతిలో తీసుకోవద్దు. అలాగే ఏదైనా అనుకోని ఘటన జరిగితే అపాయంలో ఉన్న వారికి వెంటనే సాయం చేసేలా ముందుకు సాగండి. ఎక్కడైనా చిన్న అలజడి రేగిన వెంటనే స్పందించేలా పని చేయండి. అందరి దగ్గర వాకి టాకీలు ఉండే అవకాశం లేదు. ఎప్పటికప్పుడు కళ్ళతోనే కమ్యూనికేషన్ చేసుకునేలా వచ్చే జన ప్రవాహాన్ని తగిన రీతిలో సర్దుబాటు చేసేలా పని చేయాలి అన్నారు. ఈ సమావేశంలో పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్, ఎమ్మెల్యేలు పంతం నానాజీ, టిడ్కో చైర్మన్ వేములపాటి ఆజయ కుమార్, కాపు కార్పోరేషన్ చైర్మన్ కొత్తపల్లి సుబ్బారాయుడు, కాకినాడ అర్బన్ డెవలప్మెంట్ చైర్మన్ తుమ్మల బాబు, పార్టీ ఉపాధ్యక్షుడు బి.మహేందర్ రెడ్డి, కోశాధికారి ఎ.వి.రత్నం, కార్యక్రమాల నిర్వహణ కమిటీ చైర్మన్ కళ్యాణం శివ శ్రీనివాస్ (కెకె), తెలంగాణ ఇంఛార్జి నేమూరి శంకర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.