- కాకినాడ : కాకినాడ నగర బొడ్డున వున్న టుటౌన్ ఓవర్ బ్రిడ్జి డేంజర్ బెల్స్ మ్రోగిస్తున్నదని పౌర సంక్షేమ సంఘం నిరసన వ్యక్తం చేసింది. 1970వ దశకంలో నిర్మించిన బ్రిడ్జికి 1999లో ఎపియుఎస్ పి 2016లో స్మార్ట్ సిటీ ప్రాజెక్ట్ వచ్చినప్పుడు రంగులు వేయడం తప్ప పటిష్ట పరిరక్షణకు చర్యలు వహించక పోవడం వలన బ్రిడ్జి రైలింగ్ నూరు శాతం ఇనుముతో బాటుగా పూర్తిగా పొట్లు పోయిందన్నారు. బ్రిడ్జీకి రెండు వైపులా శిథిల రైలింగ్ కి ఆనుకుని వున్న 58 విద్యుత్ స్తంభాలకు నిరంతరం నిలువెత్తు ఫుల్ ఫ్లెక్స్ బోర్డులు బిగించడం వలన మరింత శిథిలం కాబడిందన్నారు. శిథిలాలు క్రిందికి జారిపడుతున్న దృష్ట్యా బ్రిడ్జి దిగువన సూర్యారావు పేట పేర్రాజు పేట ప్రాంత దారుల్లో నడవడం వాహనాలపై ప్రయాణించడం ప్రమాదకరంగా తయారయ్యిందన్నారు. బ్రిడ్జి దిగువ ఇండ్లల్లో వుంటున్న వారికి ఎప్పుడు ఏ శిథిలం క్రిందికి జారిపడుతుందోనన్న భయం గడియ గడియకు గండంగా మారిందన్నారు. ఇదే దుస్థితిలో జగన్నాధపురం ఉప్పుటేరు మీద వార్ఫ్ రోడ్ నుండి వినాయక సాగర్ నుండి అన్నమ్మ ఘాటీ రోడ్ వైపుకు వున్న ఎన్ టి ఆర్ బ్రిడ్జి రైలింగ్ ప్రహారీలు ఒరిగిపోయి విరిగిపోయి శిథిల స్థితిలో చేరుకున్న దుస్థితి వుందన్నారు. వేసవిలో వచ్చే ఆకస్మిక భారీ వర్షాల్లో పూర్తిగా కూలిపోయే ప్రమాదం వుందన్నారు. ప్రజలకు ప్రాణసంకటంగా తయారైన ఓవర్ బ్రిడ్జీల శిథిల రైలింగ్ ప్రహరీలు తొలగించాలని డిమాండ్ చేశారు. నిధులు లేవని నిర్లక్ష్యం చేస్తే ప్రజల ప్రాణాల మీదకు వచ్చే ప్రమాదం వుందని హెచ్చరించారు. జాతీయ రహదారుల్లో వున్న ఈ రెండు వంతెనల దుస్థితి పట్ల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వా లు శ్రద్ధ చేయాలన్నారు. జిల్లా యంత్రాంగం ఆర్ అండ్ బి మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు బాధ్యత వహించాలని విజ్ఞప్తి చేశారు. నగరంలోని ఫ్లై ఓవర్ బ్రిడ్జిల ప్రమాణా లపై బహిరంగ నివేదిక ప్రకటించాలన్నారు.

previous post