కాకినాడ : భోగిగణపతి పీఠంలో శనివార సుప్రభాత వేళలో వజ్రకవచ స్తోత్రంతో వేంకటేశ్వరస్వామి వారికి 78వ జపయజ్ఞపారాయణను శ్రీవారి సేవకులు నిర్వహించారు. పండ్ల రసాలతో అభిషేకం, సప్తగిరుల నారికేళ సమర్పణ, గోవింద సంకీర్తన, తోమాలసేవ జరిగింది. దీపారాధకులకు పసుపు, కుంకుమ, తాంబూలాలతో రవికలు ప్రదానం చేశారు. పీఠం వ్యవస్థాపక ఉపాసకులు దూసర్లపూడి రమణరాజు మాట్లాడుతూ తిరుమల వేంకటేశ్వరస్వామి వారికి 14వ శతాబ్దంలో తొండమాన్ చక్రవర్తి బంగారు తులసిదళాలు, 15వ శతాబ్దంలో శ్రీకృష్ణదేవరాయలు వజ్రకవచ ఆభరణాలతో పూజా కైంకర్యాలు చేయించి ధన్యులయ్యారన్నారు. శ్రీవారి పారాయణలో వజ్రకవచధర గోవింద స్తోత్రం అత్యంత మహిమాన్వితమన్నారు. శ్రీవారి పాదాల వద్ద బియ్యపుపిండి, అరటిపండు గుజ్జు, బెల్లం, ఆవుపాలతో కలిపి తయారు చేసిన ప్రమిదల్లో ఆవునెయ్యితో వెలిగించే సప్తజ్యోతులతో 7శనివారాలు ఆరాధన చేయడం వలన శ్రీకర శుభాలు కలుగుతాయని, ప్రారబ్ధ కర్మల పారిహరం ఏలినాటి శని ప్రభావం, రాహు, కేతు దోష నివారణ కలుగుతుందని పీఠం తెలియజేసింది. అర్చన అనంతరం వీటిని సముద్ర జలాల్లోకి నిమజ్జనం చేయడం వలన జల భూగర్భ చరాలు స్వీకరించి మానవ జన్మకు మోక్షాన్ని పొందే భాగ్యం కలుగుతుందన్నారు. భాగ్యసిద్ది పొందే శ్రీవారి పారాయణ లోక కళ్యాణానికి శ్రీకరమైన జపయజ్ఞమని తెలిపారు.