వికారాబాద్ జిల్లాలోని తాండూరు పట్టణంలో గంజాయి విక్రయిస్తున్న ఒక వ్యక్తిని పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. ఈ పట్టుబడిన వ్యక్తి నుండి 1.5 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు జిల్లా ఎస్పీ కె. నారాయణ రెడ్డి ఐపీఎస్ ప్రకటించారు. అట్టి వివరాలు క్రింది విధంగా ఉన్నాయి.జిల్లా టాస్క్ ఫోర్స్ ఇన్‌స్పెక్టర్ ఎం.డి. అన్వర్ పాషా, తాండూరు ఎస్‌హెచ్‌ఓ సంతోష్ కుమార్, కు అందిన నమ్మదగిన సమాచారం మేరకు, బుధవారం (జూన్ 25, 2025) ఎస్‌హెచ్‌ఓ సంతోష్ కుమార్, ఇన్‌స్పెక్టర్ అన్వర్ పాషా తమ సిబ్బందితో పాటు ఇద్దరు పంచులు (సాక్షులు)ను వెంటబెట్టుకుని తాండూరు పట్టణంలోని విలేమూన్ చౌరస్తాలో తనిఖీలు చేపట్టారు.
తనిఖీలలో భాగంగా, ఒక వ్యక్తి గోనె సంచి వేసుకొని నడుచుకుంటూ అనుమానాస్పదంగా కనిపించాడు. పోలీసులు అప్రమత్తమై వెంటనే ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకొని విచారించారు. విచారణలో, అదుపులోకి తీసుకున్న వ్యక్తి తన పేరు మొహమ్మద్ రఫీక్ (వయస్సు 43సంవత్సరాలు), తండ్రి మొహమ్మద్ షబ్బీర్, వృత్తి పండ్ల వ్యాపారి, నివాసం సీతారాంపేట్, తాండూరు, వికారాబాద్ జిల్లా అని వెల్లడించాడు.మొహమ్మద్ రఫీక్‌ను మరింత లోతుగా ప్రశ్నించగా, అతను తన నేరాన్ని స్వచ్ఛందంగా అంగీకరించాడు. తన సంపాదన కుటుంబ పోషణకు సరిపోవడం లేదని, అందుకే పొడి గంజాయిని విక్రయించాలని నిర్ణయించుకున్నానని, అందుకోసమే గంజాయిని తీసుకొని వచ్చి అమ్ముతున్నట్లు ఒప్పుకున్నాడు.ఈ ఘటనపై తాండూరు పోలీస్ స్టేషన్ లో ఎన్ డి పి ఎస్ చట్టం ప్రకారం కేసు నమోదు చేసి, నిందితుడి నుండి సుమారు 30,000 రూపాయల విలువైన, మొత్తం 1.5 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకోవడం జరిగింది అని ఎస్పీ వివరించడం జరిగింది.
గంజాయి అక్రమ రవాణా, విక్రయాలపై ఉక్కుపాదం మోపుతామని, ఇలాంటి నేరాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ ఈ సందర్భంగా స్పష్టం చేశారు. జిల్లాలో శాంతిభద్రతల పరిరక్షణకు, నేరాల నియంత్రణకు పోలీసులు నిరంతరం కృషి చేస్తారని, మత్తు పదార్థాల వ్యాపారం చేసే అది సమాచారం తెలిస్తే పోలీస్ అధికారులకు తెలియజేయాలని ఎస్పీ తెలిపినారు.ఈ కేసును విజయవంతంగా ఛేదించిన జిల్లా టాస్క్ ఫోర్స్ ఇన్‌స్పెక్టర్ ఎం.డి. అన్వర్ పాషా, టాస్క్ ఫోర్స్ సిబ్బందికి తాండూరు ఇన్స్పెక్టర్ సంతోష్ కుమార్ తాండూర్ పోలీస్ సిబ్బందికి జిల్లా ఎస్పీ కె. నారాయణ రెడ్డి అభినందించారు.