పిఠాపురం : ప్రణాళికా బద్ధంగా పిఠాపురంను నందనవనంగా తీర్చిదిద్దుతాము అని శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం నవమ పీఠాధిపతి డా ఉమర్ ఆలీషా అనుగ్రహ భాషణ చేశారు. స్థానిక జగ్గయ్య చెరువు ఐ.సి.డి.ఎస్ పరిసర ప్రాంతాల్లో ఉమర్ ఆలీషా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ ఆధ్వర్యంలో రెండవ విడత మేక్ గ్రీన్ పిఠాపురం అనే కార్యక్రమంలో భాగంగా పీఠాధిపతి డా ఉమర్ ఆలీషా అధ్యక్షత వహించగా, పిఠాపురం మాజీ ఎమ్మెల్యే ఎస్.వి.ఎస్.ఎన్.వర్మ, మున్సిపల్ కమిషనర్ కనకారావు, అహ్మద్ ఆలీషా అతిథులుగా పాల్గొని నా మొక్క నా శ్వాస అనే కార్యక్రమంలో మొక్కలు నాటి అనంతరం ప్రసంగించారు. ఈ సందర్భంగా పీఠాధిపతి డా ఉమర్ ఆలీషా మాట్లాడుతూ పిఠాపురంను ఒక ఉద్యానవనంగా తీర్చిదిద్దే హరిత యజ్ఞంలో ప్రతీ ఒక్కరూ భాగస్వాములు కావాలని కోరారు. 6 నెలలు ప్రణాళిక బద్ధంగా మొక్కలు నాటే యజ్ఞంలో పుర ప్రజలు, రాజకీయ నాయకులు సహకరించాలని కోరారు. మాజీ శాసనసభ్యుడు ఎస్.వి.ఎస్.ఎన్ వర్మ మాట్లాడుతూ శ్రీ విశ్వ విజ్ఞాన విద్యా ఆధ్యాత్మిక పీఠం పిఠాపురంలో ఉండుటం పిఠాపురం ప్రజల అదృష్టంగా అభివర్ణించారు. పీఠాధిపతి డా ఉమర్ ఆలీషా ఆధ్యాత్మిక సేవలు మాత్రమే కాకుండా ఉమర్ ఆలీషా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు అని శ్లాఘించారు. మన పిల్లలను ఎంత జాగ్రత్తగా పెంచుతామో, మొక్కలను అంత కంటే ఎక్కువ జాగ్రత్తగా పెంచాలన్నారు. మున్సిపల్ కమిషనర్ కనకారావు మాట్లాడుతూ ఉమర్ ఆలీషా ట్రస్ట్ వారు కొద్దిరోజుల క్రితం పట్టణంలో ఉన్న కోర్టు ఆవరణలో మొక్కలు నాటడం జరిగిందన్నారు. రోడ్డుకు ఇరువైపులా అవెన్యూ ప్లాంటేషన్ కొరకు మున్సిపల్ సిబ్బంది మ్యాపింగ్ కూడా చేయడం జరిగిందని, ఉమర్ ఆలీషా ట్రస్ట్ ద్వారా చేస్తున్న సేవలను ఆయన కొనియాడారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఫ్లోర్ లీడర్ అల్లవరపు నగేష్, అచ్చంపేట సర్పంచ్ సలాది రమేష్ తదితరులు పాల్గొని మొక్కలు నాటారు.

previous post