మోతే: తెలంగాణ రాష్ట్రంలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని డిమాండ్ తో ఈ నెల 5న హైదరాబాద్ ఇందిరా పార్క్ జరిగే మహా ధర్నాను జయప్రదం చేయాలని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు మట్టిపల్లి సైదులు పిలుపునిచ్చారు. సోమవారం మోతే మండల కేంద్రంలో జరిగిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ తెలంగాణలో జరిపిన కులగలన ఆధారంగా బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేసేందుకు అసెంబ్లీలో బిల్లు ఆమోదించి కేంద్రానికి పంపిస్తే కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి ప్రభుత్వం బీసీల రిజర్వేషన్లను అడ్డుకుంటుందని ఆరోపించారు. బీసీల రిజర్వేషన్లపై ఆర్డినెన్స్ తీసుకువచ్చి గవర్నర్కు పంపిస్తే ఆయన కూడా జాప్యం చేస్తున్నారని అన్నారు. దీనివల్ల స్థానిక సంస్థల ఎన్నికలు ఆలస్యం అవుతూ కేంద్రం నుండి గ్రామ పంచాయతీలకు రావలసిన నిధులు రాకుండా పోతున్నాయి అన్నారు. గుజరాత్, ఉత్తరప్రదేశ్, కర్ణాటక, రాజస్థాన్ లాంటి బిజెపి పాలిత రాష్ట్రాలలో ముస్లింలకు రిజర్వేషన్లు అమలు చేస్తున్న బిజెపి తెలంగాణలో మాత్రం అమలుకు అడ్డుకుంటుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో బీసీల రిజర్వేషన్ బిల్లును పార్లమెంటులో ఆమోదించాలని, చట్టం చేయాలని ఆగస్టు 5న హైదరాబాద్ ఇందిరా పార్క్ దగ్గర మహాధర్నా నిర్వహిస్తున్నామని అన్నారు. బీసీ రిజర్వేషన్లపై రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏకపక్షంగా వ్యవహరించకుండా అందరినీ కలుపుకొని బిజెపి పై ఒత్తిడి తెచ్చి బీసీ రిజర్వేషన్లు అమలు చేసేందుకు ఐక్య పోరాటాన్ని కొనసాగించాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో సిపిఎం మండల కార్యదర్శి ములుకూరిగోపాల్ రెడ్డి, మండల కమిటీ సభ్యులు కాంపాటి శ్రీను, కిన్నెర పోతయ్య, కక్కిరేణి సత్యనారాయణ, గుంట గాని ఏసు, సోమ గాని మల్లయ్య, జంపాల స్వరాజ్యం, చర్లపల్లి మల్లయ్య, బానోతు లచ్చిరాంనాయక్ పాల్గొన్నారు.