కాంగ్రెస్ పాలనలో మిషన్ భగీరథ పై పర్యవేక్షణ కరువైందని మున్సిపల్ వైస్ చైర్మన్ పుట్ట కిషోర్ అన్నారు. మంగళవారం మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రజలు త్రాగునీటి కోసం ఇబ్బందులు పడకూడదన్న లక్ష్యంతో మాజీ ముఖ్యమంత్రి *కల్వకుంట్ల చంద్రశేఖర రావు ప్రతిష్టాత్మకంగా మిషన్ భగీరథ కార్యక్రమాన్ని చేపడితే అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం మిషన్ భగీరథ పట్ల నిర్లక్ష్యం వహించి ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నారని అన్నారు. సూర్యాపేటకు కేటాయించిన నీటిని అక్రమంగా కోదాడకు తరలించక పోతున్నారని మండిపడ్డారు. గతంలో జిల్లా మంత్రిగా గుంటకండ్ల జగదీశ్ రెడ్డి ప్రతినిత్యం అధికారులతో రివ్యూలు పెడుతూ అధికారులను సమన్వయ చేసి త్రాగునీటి సమస్య లేకుండా ముందు జాగ్రత్తలు తీసుకునేవారని గుర్తు చేశారు. సూర్యాపేట పట్టణంలో ఏ సమయంలో నల్ల నీరు వస్తుందో తెలియక ప్రజలు అయోమయానికి గురవుతున్నారని తెలిపారు. రానున్న వేసవికాలంను దృష్టిలో పెట్టుకొని త్రాగునీటి సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేశారు.