కాకినాడ : వినాయక చవితి పండుగ సందర్భంగా స్థానిక నాగమల్లి తోట వద్ద ఉన్న శ్రీసత్య దంత వైద్యశాలలో కాకినాడ ఐడిఎ సభ్యుల ఆధ్వర్యాన ప్రజలకు మట్టి వినాయక విగ్రహాలను పంపిణీ చేసారు. కాకినాడ ఐడిఎ కార్యదర్శి డాక్టర్ అడ్డాల మాట్లాడుతూ వినాయక చవిత ఉత్సవాలకు దేశం యావత్తు సిద్ధమవుతోందని, పండగలు, సంప్రదాయాల పరిరక్షణతో పాటు సామాజిక బాధ్యతను కూడా తీసుకోవాల్సిన తరుణమిదని అన్నారు. మట్టి గణపతి పూజ శ్రేష్ఠమని, రసాయన రంగులతో కూడిన ప్లాస్టర్ ఆఫ్ పేరిస్ విగ్రహాలు వినియోగించవద్దన్నారు. హిందూ సమాజంలో ప్రకృతిని (పంచభూతాలు, జీవరాశులు) ఆరాధించడం ఒక ముఖ్యమైన సంప్రదాయమని,
భూమి, నీరు, ఆకాశం, గాలి, అగ్ని అనే పంచభూతాలను అలాగే మారేడు, వేప, తులసి, ఆవు వంటి ప్రకృతిలోని జీవరాశులను కూడా ఆరాధిస్తామని, ఈ ఆరాధనా సంప్రదాయం, ప్రకృతిని గౌరవించి, రక్షించాలనే ఒక భావనను తెలియజేస్తుందని తెలిపారు. పండుగలు, ఉత్సవాల సమయంలో శబ్ద, వాయు, జల కాలుష్యాలు పెరిగి పర్యావరణానికి హాని కలుగుతుందని, పట్టణాల్లో ప్రారంభమైన ఈ అలవాటు, పచ్చని గ్రామాల్లోకి కూడా వ్యాపించి, గ్రామాలను కాలుష్య కేంద్రాలుగా మారుస్తోందని ఆందోళన వ్యక్తం చేసారు. కాబట్టి వినాయక చవితి ఉత్సవాల్లో కాలుష్యానికి కారణమయ్యే, ప్రజలకు ఇబ్బందులు సృష్టించే పద్ధతులను పక్కనబెట్టి, పర్యావరణ హిత గణపతులకు ప్రాధాన్యమిద్దాం అని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కాకినాడ ఐడిఎ సభ్యులు డా.శ్రీవల్లి, డా.మాధురి అనిల్ తదితరులు పాల్గొన్నారు.