పిఠాపురం : విశ్వ హైందవ పరిషత్ రాష్ట్ర అధ్యక్షుడు డి.వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో సోమవారం పట్టణంలోని పాత్రికేయుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నెల 27వ తేదీ వినాయకచవితిని పురస్కరించుకొని ముందుగా హైందవ సమాజానికి వినాయకచవితి శుభాకాంక్షలు తెలియజేశారు. విఘ్నాలు తొలగించే గణేష్ ఉత్సవాలకి ప్రభుత్వం ఏవిధమైన ఆంక్షలు విధించవద్దని ఆయన కోరారు. కొన్ని లక్షల మందికి జీవనాధారమైన గణేష్ ఉత్సవాలని వైభవంగా జరిగే విధంగా చర్యలు తీసుకోవాలని, హిందువులంతా భక్తితో గణేష్ ఉత్సవాలను ఘనంగా నిర్వహించుకోవాలన్నారు. సినిమా పాటలు, ఆశ్లీల నృత్యాలు, వికృత రూపాలతో గణేష్ విగ్రహాలు లేకుండా ఛత్రపతి శివాజీ, బాలగంగాధర్ తిలక్ స్ఫూర్తితో కులాలకు, ప్రాంతాలకు అతీతంగా ఐకమత్యంగా ఈ ఉత్సవాలను నిర్వహించుకోవాలని తెలిపారు. స్వాతంత్రోధ్యమ సమయంలో భారతీయులను ఏకం చేయడానికి బాలగంగాధర్ తిలక్ మొట్టమొదట సారిగా పూణేలో బహిరంగ గణేష్ ఉత్సవాలు మొదలుపెట్టారని తెలియజేశారు. ఛత్రపతి శివాజీ వినాయక చవితి (గణేష్ చతుర్థి) స్వరాజ్ హిందూ స్థాపన కోసం ఆయన తన పాలనలో తన ప్రజలలో ఐక్యత మరియు సంస్కృతిని పెంపొందించడానికి ఈ పండుగను బహిరంగంగా జరుపుకునేలా ప్రారంభించారని తెలిపారు. మట్టి వినాయకుడిని పూజిద్దాం – పర్యావరణాన్ని పరిరక్షిద్దామన్నారు. మండపాలలో సినిమా హీరోలు, సినిమా పేర్లను అనుకరించి తయారు చేయబడిన విగ్రహాలను పెట్టవద్దని, గణపతి మండపాలలో ఉదయం, సాయంకాలం ధూప, దీప, నైవేదలతో పూజలు జరిగేటట్లు చూడాలన్నారు. సామూహిక భజనలు, విష్ణు, లలిత సహస్రనామ పారాయణాలు నిరంతరం జరిపే విధంగా వినాయక చవితి మండపం ఏర్పాటు చేసే సభ్యులు చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రతి రోజు భక్తిని పెంచే విధంగా హరికథ, ధార్మికమైన ఉపన్యాసాలను కాని ఏర్పాటు చేయాలన్నారు. భక్తి చిత్రాలను ప్రదర్శించి, భక్తులకు హైందవ సాంప్రదాయాలు తెలియజేయాలన్నారు. మహిళలచే సామూహిక కుంకుమార్చనలు పూజలు చేయించి, బాలబాలికలకు పద్యాలు, గేయాలు, శ్లోకాలపై పోటీలు నిర్వహించి బహుమతులివ్వాలన్నారు. గణేష్ మండపాలలో ఛత్రపతి శివాజీ ఫొటో, బాలగంగాధర్ తిలక్ ఫొటో ఏర్పాటు అయ్యేలా చూడాలని మండపం నిర్వాహకులకు సూచించారు. మద్యం సేవించి గణేష్ నిమజ్జన కార్యక్రమాలు చేయడం సరికాదన్నారు. విశ్వ హైందవ పరిషత్ రాష్ట్ర కార్యదర్శి మణికుమార్, నాగాభట్ల లక్ష్మణశర్మ, బూరి సురేంద్రదత్త, ఈశ్వరరావు, అరిగెల ప్రసాదరావు, చంద్రశేఖర్ తదితరులు ఈ పత్రికా సమావేశంలో పాల్గొన్నారు.
