సూర్యాపేట: ప్రజల సమస్యలు గాలికి వదిలేసి కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి, రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వాలు ఒకరిపై ఒకరు ఆరోపణలకు పరిమితమయ్యారని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు, మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి ఆరోపించారు. ఆదివారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని మల్లు వెంకట నరసింహారెడ్డి భవన్ లో జరిగిన సిపిఎం పార్టీ జిల్లా కమిటీ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరై ఆయన మాట్లాడుతూ కేంద్రంలో మూడోసారి అధికారంలోకి వచ్చిన బిజెపి ప్రభుత్వం దేశ అభివృద్ధి, ప్రజా సమస్యలు పట్టించుకోకుండా ప్రజలపై విపరీతమైన బారాలు చేస్తూ అన్ని వ్యవస్థలను బలహీనపరుస్తూ బడా, కార్పొరేట్ శక్తులు బాగు చేసే విధానాలు అనుసరిస్తుందని ఆరోపించారు. బిజెపి ప్రభుత్వం మత విద్వేషాలను పెంచి పోషిస్తు మరోపక్క ప్రతిపక్షాలపై అర్థంలేని విమర్శలు, స్థాయి లేని ఆరోపణ చేసుకుంటూ కాలం గడుపుతున్నారని విమర్శించారు. దీనివలన నిరుద్యోగులు, చేతి వృత్తుదారులు, కార్మికులు, రైతులు, మహిళలు, వ్యవసాయ కార్మికులు గా ఉన్న సకల జనులు అనేక కష్టానష్టాలకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఒకే ఎన్నిక,ఒకే భాష, ఒకే సంస్కృతి, ఒకే పన్ను అనుకుంటూ ప్రజల మధ్య ఆర్దిక సమానతలు పెంచుతూ నూటికి 90 శాతం గా ఉన్న ప్రజల సంపద కొల్లగొట్టి 10 శాతంగా ఉన్న బడా, స్వదేశీ, విదేశీ పెట్టుబడిదారులకు కట్టబెడుతుందని అన్నారు. మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ప్రజలు కదిలి పొరల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. 100 రోజుల్లో ఆరు గ్యారెంటీ పథకాలను అమలు చేస్తామని చెప్పి అధికారంలోకి వచ్చి 300 రోజులు దాటిన మూడు వాగ్దానాలు మాత్రమే అమలు చేసిందని ఆరోపించారు. మిగతా హామీలు వెంటనే అమలుచేసి కాంగ్రెస్ తన చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని సూచించారు. పూర్తిస్థాయిలో మంత్రి మండలి నేటికీ ఏర్పాటు నేటికీ చేయలేకపోయారని అన్నారు. రైతులకు రుణమాఫీఅందరికీ అమలు చేయలేకపోయారని అన్నారు.రైతు భరోసా,గిట్టుబాటు ధరవంటివి మర్చిపోయారని అన్నారు. అసంఘటితరంగా కార్మికుల సమస్యలు తీర్చలేకపోయారని, మహిళలు, నిరుద్యోగులకు ఇచ్చిన హామీలు అమలుకు నోచుకోవడం లేదన్నారు. హైడ్రా పేరుతో పేదల జీవితాలతో కాంగ్రెస్ ప్రభుత్వం ఆటలాడుతుందన్నారు. పేదలకు ఇల్లు నిర్మించిన తర్వాతనే మూసి పరివాహ ప్రాంతాలలో పనులు ప్రారంభించాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న సర్వేలో వచ్చిన, వ్యక్తమైన సమస్యలను చిత్తశుద్ధితో అమలు చేయడం తో ప్రజల్లో ఉన్న అనుమానాలను తొలగించాలని కోరారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం కళ్లు తెరిచి ఎన్నికలు ఇచ్చిన వాగ్దానాలు అమలు చేయడానికి చిత్తశుద్ధితో పనిచేయకపోతే ప్రజలు పెద్ద ఎత్తున కదిలి పోరాటాలకు సిద్ధమవుతారని హెచ్చరించారు. సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు నాగారపు పాండు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యురాలు మల్లు లక్ష్మి, సిపిఎం జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జున రెడ్డి, సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు నెమ్మాది వెంకటేశ్వర్లు, కొలిశెట్టి యాదగిరిరావు, మేదరమెట్ల వెంకటేశ్వరవు, మట్టి పెళ్లి సైదులు,కోట గోపి,చెరుకు ఏకలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.