సంక్షేమ పథకాలు అమలు చేస్తామంటూ ఎన్నికల్లో హమీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, పాలకులవి 420మాటలేనని మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్ ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ ప్రజావంచన దినోత్సవాల్లో బాగంగా పలిమెల మండలంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈసందర్బంగా ఆయన మాట్లాడుతూ ఆనాడు ఆరు గ్యారెంటీ పథకాలు అమలు చేస్తామంటూ ఇంటింటికి తిరిగి సంతకాలు పెట్టి మరీ ప్రచారం చేశారని, అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లోనే ఆరు గ్యారెంటీ పథకాలు అమలు చేస్తామని చెప్పి ప్రజలను ఆగం చేశారని ఆయన అన్నారు. వంద రోజులు పూర్తియిపోయి ఏడాది కావస్తున్నా ఆరు గ్యారెంటీలో ఒక్క మహిళల ఉచిత బస్సు ప్రయాణం తప్ప ఏ ఒక్కటైనా పూర్తిస్థాయిలో అమలు చేశారా అని ఆయన ప్రశ్నించారు.ఆరు గ్యారెంటీ పథకాలతో పాటు 420 హమీలు ఇచ్చిన కాంగ్రెస్ అందులో ఏ ఒక్కటి అమలు చేయకుండా విజయోత్సవాలు జరుపుకోవడం ఏంటని ఆయన విమర్శించారు. ప్రజలు నమ్మి ఓట్లు వేసి అధికారం అప్పగిస్తే వాళ్లను దగా చేశారని ఆయన అన్నారు. కాంగ్రెస్ పార్టీ మ్యానీఫెస్టో కమిటి చైర్మన్‌గా ఉన్న మంథని ఎమ్మెల్యే పథకాల అమలులో విఫలం అయ్యారని, ఆనాడు కేవలం అధికారం, పదవుల కోసమే చూశారే తప్ప పేద ప్రజల సంక్షేమంపై ఆలోచన చేయడం లేదన్నారు. కాంగ్రెస్ అంటేనే మోసం అబద్దాలు అని, గృహజ్యోతి పేరు మీద 200 యూనిట్ల ఉచిత విద్యుత్ అని చెప్పి ప్రజలను మోసం చేశారు అని, మళ్లీ బిల్లు లు వస్తున్నాయని, కరెంటు సక్రమంగా ఉండడం లేదని ప్రజలు చెప్తున్నారని అన్నారు, సన్నరకం ధాన్యంకు బోనస్ అంటూ రైతును మభ్యపెడుతున్నారని, ఇప్పటి వరకు రైతురుణమాఫీ వంద శాతం చేయలేదన్నారు. తెలంగాణాలో ఇచ్చిన హమీలన్నీ అమలు చేస్తున్నామంటూ మహారాష్ట్రలో ప్రచారం చేస్తున్నారని, ఇక్కడి తరహాలోనే మహారాష్ట్ర ప్రజలను మోసం చేసేందుకు చూస్తున్నారని ఆయన విమర్శించారు. కాంగ్రస్ పార్టీ ప్రభుత్వం పాలకులు ఇచ్చిన హమీలను మర్చి విజయోత్సవాలు జరుపుకోవాలని చూస్తున్నారని, అందుకు నిరసనగా కాంగ్రెస్ ప్రజావంచన దినోత్సవాలు జరుపుకోవడం జరుగుతుందని ఆయన తెలిపారు. ఇప్పటికైనా ప్రభుత్వం దిగివచ్చి ప్రజలకు ఇచ్చిన హమీలను, ఆరు గ్యారెంటీ పథకాలను అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.