మల్లన్న సాగర్ ముంపు గ్రామమైన పల్లెపహాడ్ లో బుధవారం ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలోని ఆర్ అండ్ ఆర్ కాలనీ పల్లెపహాడ్ గ్రామంలో శివాజీ మహారాజ్ విగ్రహ ప్రతిష్టాపన కోసం గ్రామ పెద్దలు, యువకుల సమక్షంలో గ్రామ ఎంట్రన్స్ వద్ద భూమి పూజ చేయడం జరిగింది. అనంతరం శివాజీ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులు అర్పించి జై శివాజీ అంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా గ్రామ పెద్దలు మాట్లాడుతూ యావత్ భరత జాతి సగర్వంగా చెప్పుకునే ధీరుడు, వీరత్వానికి ప్రతీకగా కొలుచుకునే వీరుడు ఛత్రపతి శివాజీ. పుట్టుకతోనే వీరత్వాన్ని పుణికిపుచ్చుకున్న శివాజీ గొప్ప యోధుడే కాదు యుద్ధ తంత్ర నిపుణుడు కూడా. మరాఠా రాజ్యాన్ని స్థాపించాడు. మొఘల్ చక్రవర్తులను ఎదిరించాడు. వారి సామ్రాజ్యాన్ని తన హస్తగతం చేసుకున్నాడు. ఎన్నో కోటలను తన స్వాధీనంలోకి తెచ్చుకుని ప్రజలకు అమోఘ పరిపాలనందించిన బహుజన చక్రవర్తి ఛత్రపతి శివాజీ. మొఘలులను గడగడలాడించి ఆనాడే సమానత్వ సాధనకు ఎంతో కృషి చేశాడు. హిందుత్వాన్ని అనుసరించాడు. అనుక్షణం ప్రజా సంక్షేమం కోసం పాటుపడ్డాడు అని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పిటిసి, మాజీ సర్పంచులు, మాజీ ఉప సర్పంచులు, మాజీ వార్డ్ మెంబర్స్, గ్రామ పెద్దలు, గ్రామ ప్రజలు, యువకులు తదితరులు పాల్గొన్నారు.
