300యూనిట్లలోపు వాణిజ్య వినియోగదారులను మినహాయించాలి
పౌర సంక్షేమ సంఘం
కాకినాడ : ఉదయం సాయంత్రం వేళల్లో 6నుండి 10వరకు రెండు పూటలా పీక్ అవర్ వినియోగంగా ఉదయం 10నుండి 3వరకు ఆఫ్ పీక్ వినియోగంగా మధ్యాహ్నం 3 నుండి 6వరకు రాత్రి 10నుండి 6వరకు జనరల్ వినియోగంగా పరిగణిస్తూ కమర్షియల్ విద్యుత్ కనెక్షన్ల పై వినియోగచార్జీలు ప్రవేశ పెట్టడం సమంజసంగా లేదని పౌర సంక్షేమ సంఘం పేర్కొంది. రూ.7వేల రూపాయల ఖరీదు చేసే స్మార్ట్ ప్రీ పెయిడ్ మీటర్లు తప్పని సరి చేసి ఉచితంగా యూజర్ చార్జీలు లేకుండా బిగించడం వలన వాటి భారాలు టైమ్ ఆఫ్ టారిఫ్ పేరుతో పీక్ అవర్స్ లో వినియోగదారులపై చార్జీల బాదుడు అదనంగా పడుతున్నదన్నారు. చిరు వ్యాపారులు, చిన్న పరిశ్రమలపై పారిశ్రామిక వాణిజ్య వినియోగదారులకు నూతన చార్జీల భారం పడటం వలన ఉత్పత్తి సరుకులు ఆహార వస్తువుల క్రయ విక్రయాలపై మరింతగా రేట్లు పెరుగుతాయన్నారు. కరెంటు చార్జీల బాదుడు వలన అంతిమంగా సాధారణ, మధ్య తరగతి పై ధరల ప్రభావం తీవ్రతరం అవుతుందన్నారు. సగటు కుటుంబం కొనుగోలు శక్తి తగ్గిపోయిన తరుణంలో ద్రవ్యోల్బణం ఏర్పడి రూపాయి విలువ తగ్గిపోయిన దుస్థితిలో విద్యుత్ భారాలు అధికం చేయడం వలన అన్ని రేట్లు గరిష్ఠంగా పెరుగుతాయన్నారు. విద్యుత్ చార్జీలు పెంచడం లేదంటూనే ఏపిఈఆర్సి విడుదల చేసిన టారిఫ్ మెరుపు పిడుగు చందంగా వుందన్నారు. 300 యూనిట్లలోపు వాడకం వారిని మినహాయించాలన్నారు. లేకుంటే కూలింగ్ వాటర్ బాటిల్ కూడా కనీసపు ధరకు కూడా లభించే అవకాశం ఉండదన్నారు.