కాకినాడ : స్వయంభు కాకినాడ భోగిగణపతి పీఠంలో మాఘమాస సంకష్ట హరచతుర్ధి మాసోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. 53మంది చతుర్థి ఉపవాసకులు ప్రత్యేక పూజలు చేసారు. 13వ చతుర్థి సందర్భంగా మంగళ వాయిద్యాల నడుమ జై గణేశ జయము జయము పరమేశ్వర నామాలతో నగర సంకీర్తన సహస్ర నామ పారాయణ చేశారు. పంచామృతాలతో గణపతిని అభిషేకించి, అఖండ హారతి అందించారు. నల్లద్రాక్షలతో పాలవెల్లిని నిలిపి తరుణ గణపతిని ప్రతిష్టించారు. మాఘ మాసంలో సంకష్ట హార చతుర్థి ఉపవాస వ్రత పూజవలన సర్వ దేవతల వ్రత యజ్ఞ యాగ ఫలాలతో బాటుగా జన్మించిన జీవిత లక్ష్యసాధనకు పరమార్థ సార్థకమైన వరప్రదాయక ఏకాగ్రత కార్యసిద్ధి కలుగుతుందని పీఠం తెలియజేసింది. చంద్రునికి ఆర్ఘ్యంతో నీరాజనాలు సమర్పించిన వ్రతదీక్ష ఉపవాసకులకు అల్పాహార సమారాధన ఏర్పాటు చేశారు. స్వయంభువుకి పంచలోహాల తాపడంతో కాంస్య కవచ యజ్ఞం జరిగిన సందర్భగా 24 నెలల పాటు ఉపవాసకులతో చతుర్థి మాసోత్సవాలు ప్రత్యేకంగా జరుగుతున్నాయని పీఠం ఉపాసకులు దూసర్లపూడి రమణరాజు తెలిపారు.