కాకినాడ : అయిదు లక్షల జనాభా కలిగిన కాకినాడ జిల్లా కేంద్రానికి సరిపడిన రీతిగా గోదావరి జలాల సమ్మర్ స్టోరేజీ సామర్థ్యం కొరవడటం వలన వేసవి ఎండల్లో సమృద్ధిగా త్రాగునీరు సరఫరా చేయడంలో వైఫల్యం చెందుతున్నదని పౌర సంక్షేమ సంఘం పేర్కొంది. వంద ఎకరాల విస్తీర్ణంలో సామర్లకోట సాంబమూర్తి నగర్ రిజర్వాయర్ వున్నప్పటికీ 35 అడుగుల ఎత్తు వుండాల్సిన నీరు నిల్వలు 26 అడుగులకే పరిమితం కావడం, అదే స్థాయిలో వున్న అరట్ల కట్ట స్టోరేజ్ చెరువు నీరు నిల్వలు తగ్గిపోవడం, శీతాకాలంలో చెరువుల పూడికలు తీయకపోవడం, లోతు తగ్గిపోవడం, కాలం చెల్లిన మోటార్లు, కరెంటు కోతలు కారణంగా నీరు సరఫరా సామర్థ్యం తగ్గిపోతున్నదన్నారు. వాటర్ వర్క్స్ గ్రౌండ్ లో 15 శశికాంత్ నగర్ ప్లాంట్ వద్ద 8 ఫిల్టర్ వాటర్ బెడ్స్ వున్నప్పటికీ అదనపు సమ్మర్ స్టోరేజ్ లేని కారణంగా మూడింటిని వినియోగించడం లేదన్నారు. సాంబమూర్తి రిజర్వాయర్ వద్ద గోదావరి జలాలను గంటకు లక్ష 80 వేల కిలో లీటర్ల మేరకు ఆరట్లకట్ట వద్ద గంటకు లక్షా నలభై వేల కిలో లీటర్లు పంపింగ్ సామర్థ్యం చేస్తున్నప్పటి కీ చెరువులు నిండుకుండగా ఉంచే సామర్థ్యం చేయడంలేదన్నారు. వేసవి త్రాగునీటి కొరతలో రిజర్వాయర్ల సామర్థ్యాన్ని పూర్తిగా వినియోగించుకునే అవకాశం లేకుండా ఉంచుతున్నారన్నారు. ప్రస్తుతానికి నేరుగా గోదావరి జలాలు పంపింగ్ చేయడం వలన నీరు కొరత సమస్య ప్రస్తుతం లేకపోయినప్పటికీ మే నెల నాటికి ఇబ్బంది కలిగే వాతావరణం వుందన్నారు. చేపల పెంపకం వలన వాటిని పట్టడానికి వీలుగా నీరు నింపడంలేదన్న ఆరోపణలు ఉన్నాయన్నారు. 35 మంది ప్రభుత్వ ఉద్యోగులు, 150 మంది కాంట్రాక్ట్ సిబ్బంది సామర్థ్యం వాటర్ వర్క్స్ నిర్వహణకు సరిపోవడంలేదన్నారు. లీకులు కారణంగా రంగుమారిన నీరు కుళాయిలు ద్వారా వస్తున్నదన్నారు. ధవళేశ్వరం నుండి నేరుగా భూగర్భ పైపు లైన్లు నిర్మాణం చేయడం వలన భవిష్యత్ ప్రయోజనాలు శాశ్వతంగా వుండే వీలున్నపటికీ చేపట్టక పోవడం దురదృష్టకరంగా వుందన్నారు. పండూరు వద్ద 300 ఎకరాల రిజర్వాయర్ ఏర్పాటుకు ప్రణాళిక చేసినా కార్యరూపం దాల్చలేదని, ప్రత్యామ్నాయంగా మరో ప్రతిపాదన చేయలేదన్నారు. అదనపు సమ్మర్ స్టోరేజీ లేకపోవడం వలన శశికాంత్ నగర్ వద్ద మూడు ఫిల్టర్ బెడ్స్ నిర్వహణ జరగడంలేదన్నారు. కార్పోరేషన్ కు మూడేళ్లుగా పాలకవర్గం లేకపోవడం, రెండేళ్లుగా నలుగురు కమీషనర్లు బదిలీ కావడం, సిటీ, రూరల్ ఎమ్మెల్యేలు కమీషనర్ సంయుక్తంగా సమీక్షలు చేయకపోవడం, ప్రత్యేక అధికారి అఖిలపక్షం నిర్వహణ చేయలేకపోవడం వలన పౌర సాకర్యాల వెతల్లో రానున్న వేసవికి త్రాగునీటి సామర్థ్యం తగ్గిపోతున్న దుస్థితి ఏర్పడిందన్నారు. మున్సిపల్ మంత్రి, జిల్లా మంత్రి ప్రత్యేక శ్రద్ధ చేయాల్సిన బాధ్యత వుందని పౌర సంఘం కన్వీనర్ సామాజిక వేత్త దూసర్లపూడి రమణరాజు డిమాండ్ చేశారు.

previous post
next post