మహిళల రక్షణ కోసం ఉన్న చట్టాల గురించి మహిళలు అవగాహన కలిగి ఉండాలని కోదాడ ప్రిన్సిపాల్ జూనియర్ సివిల్ జడ్జి కె. భవ్య కోరారు. శనివారం కోదాడ కోర్టులో నిర్వహించిన న్యాయవిజ్ఞాన సదస్సులో ఆమె మాట్లాడుతూ మహిళలు తమ హక్కుల కోసం, తమకు జరుగుతున్న అన్యాయాలపై చట్టాలను రక్షణగా ఉపయోగించుకొవాలన్నారు,మహిళలు గృహహింస కు గురైతే కోర్టులో కేసు వేసుకోవచ్చన్నారు,గృహహింస కేసులో మహిళలకు షెల్టర్,నష్టపరిహారం, భరణం,స్ర్తీ ధనం తిరిగి ఇవ్వడం కోసం చట్టం పని చేస్తుందన్నారు. మొదటి అదనపు జడ్జి ఎం డీ. ఉమర్ మాట్లాడుతూ భారతీయ కుటుంబ వ్యవస్థ బలమైనదని,దాన్ని కాపాడుకుంటూ ముందుకు వెళ్లాలన్నారు.వివాహాలు ,కుటుంబం, సంసారాల్లో మూడవ వ్యక్తి ప్రమేయం వలన గొడవలు వస్తాయని,వాటి వలన కోర్టు వరకు రావాల్సి వస్తుందన్నారు. రెండవ అదనపు జడ్జి జకీయా సుల్తానా మాట్లాడుతూ గృహహింస చట్టంలో భాగంగా కుటుంబం నుండి వేరుగా వేరే ప్రాంతంలో నివసించే వారిపై కేసులు పెట్టడం తగదన్నారు. బార్ అసోసియేషన్ ఉపాధ్యక్షులు ఉయ్యాల నర్సయ్య అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో న్యాయవాదులు యడ్లపల్లి వెంకటేశ్వరరావు,గట్ల నర్సింహారావు, మంద వెంకటేశ్వర్లు,సామ నవీన్ కుమార్, కె.శరత్ కుమార్, ఆవుల మల్లిఖార్జున్, పారాలీగల్ వాలంటీర్లు, మండల లీగల్ సర్వీస్ కమిటీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

previous post