అధిక వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో, ప్రజల భద్రత దృష్ట్యా అన్ని మండలాల్లోని పోలీస్ అధికారులు అప్రమత్తంగా ఉండాలని అవసరమైన చోట హెచ్చరిక బోర్డు లు ఏర్పాటు చేయాలని, సిబ్బందిని నియమించాలని, ఇతర శాఖల అధికారులతో సమన్వయంగా పని చేయాలని జిల్లా ఎస్పీ నరసింహ ఐపీఎస్ సూచించారు. వ్యవసాయ పనులకు వెళ్లే రైతులు విద్యుత్ స్థంబాలు, ట్రాన్స్ఫార్మర్స్, మీటర్స్ తో జాగ్రత్తగా ఉండాలి. నీటి ప్రవాహం వద్ద సెల్ఫీలు దిగవద్దు ప్రమాదాల బారినపడవద్దు అని ఎస్పి గారు అన్నారు. ప్రయాణ సమయంలో వాహనాలను నిదానంగా నడపాలి అని కోరారు.
ఈ సందర్భంగా పోలీస్ అధికారులతో అత్యవసర టెలి కాన్ఫరెన్స్ ద్వారా ఎస్పి గారు వర్ష ప్రభావం సమీక్షించి ఆదేశాలు ఇచ్చారు. ప్రతి మండలంలో ప్రజలకు అందుబాటులో ఉండేలా ఏర్పాట్లు చేసుకోవాలని, లోతట్టు ప్రాంతాల ప్రజలకు ముందస్తు హెచ్చరికలు ఇవ్వాలని ఆదేశించారు.
అధిక వర్షాల వల్ల జిల్లాల్లో నీటి ఉద్రితికి ప్రభావితం అయ్యే నదులు, వాగులు, మరియు చెరువులు:
– సూర్యాపేట రూరల్, పెనపహడ్ మండలాల పరిధిలో మూసీ వాగు.
– కృష్ణా నది ప్రాంతం.
– మద్దిరాల, నూతనకల్ మండలాల్లో ప్రవహించే పాలేరు వాగు
– తుంగతుర్తి మండలం వెలుగుపల్లి రుద్రమచేరువు
– చింతలపాలెం మండలం పులిచింతల బ్యాక్ వాటర్ ప్రాంతం.
– కోదాడ పెద్ద చెరువు.
– అనంతగిరి పరిది పాలేరు, మున్నేరే వాగు.
– మోతే పరిది నర్సింహపురం వద్ద పాలేరు బ్యాక్ వాటర్. విబులపురం వద్ద వాగు.
– నేరెడుచర్ల పరిది మూసీ వాగు. దిర్సించర్ల చెరువు.
– పాలకవీడు, మఠంపల్లి మండలం కృష్ణా నది.
పైన తెలిపిన పరివాహ ప్రాంతాల ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని ఎస్పి గారు సూచించారు. వాటి దరిదాపుల్లో పిల్లలు, యువకులు సెల్ఫీలు తీయడానికి, ఈతలు కొట్టడానికి వెళ్లకుండా తల్లిదండ్రులు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలి.
*భారీ వర్షాల నేపథ్యంలో తీసుకోవలసిన ముఖ్య సూచనలు:*
⚡️ లోతట్టు ప్రాంతాల్లో నివసిస్తున్న వారు అవసరమైతే సురక్షిత ప్రాంతాలకు తరలిపోవాలి.
⚡️ వాగులు, కాలువలు, చెరువులు, రిజర్వాయర్లు వద్దకు వెళ్లరాదు.
⚡️ చెట్ల కింద, శిధిలావస్థలో ఉన్న భవనాల్లో ఉండరాదు.
⚡️ విద్యుత్ స్థంభాలు, ట్రాన్స్ఫార్మర్స్ ముట్టుకోరాదు.
⚡️ వాహనదారులు వర్షంలో జాగ్రత్తగా, నెమ్మదిగా ప్రయాణించాలి. రహదారుల్లో ఏర్పడిన గుంతల వల్ల ప్రమాదం జరిగే అవకాశముంది.
⚡️ వర్షాలకు చిన్న బ్రిడ్జిల వద్ద నీరు ఎక్కువగా ప్రవహిస్తున్నప్పుడు వాటిని దాటేందుకు ప్రయత్నించరాదు.
⚡️ చెరువుల కట్టలు తెగిపోవచ్చునన్న అనుమానాలున్న చోట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి.
ప్రజలు అత్యవసర పరిస్థితుల్లో వెంటనే డయల్ 100 కి కాల్ చేసి పోలీస్ సాయం పొందవచ్చు.
జిల్లా ప్రజల రక్షణకు తగిన చర్యలు తీసుకుంటున్నామని, పోలీసు శాఖ సూచనలు పాటిస్తూ అందరూ సహకరించాలని ఎస్పీ కోరారు.