ఆంధ్రప్రదేశ్లోని అల్లూరి సీతారామరాజు జిల్లా మారేడుమిల్లి అడవుల్లో ఇటీవల జరిగిన ఎన్కౌంటర్ ఘటనపై పౌర హక్కుల సంఘాలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశాయి. ఈ ఘటనలో మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడిగా అధికారులు గుర్తించిన మడవి హిడ్మా, అతని సహచరి రాజక్క (రాజే) సహా పలువురి మరణంపై నిజానిజాలు వెలుగులోకి తేవాలని డిమాండ్ చేశారు. శుక్రవారం సిద్దిపేట ప్రెస్ క్లబ్ లో ఉమ్మడి మెదక్ జిల్లా పౌర హక్కుల సంఘం జిల్లా అధ్యక్షుడు రాగుల భూపతి మాట్లాడుతూ ఈ ఘటనపై స్వతంత్ర విచారణ అవసరమని అన్నారు. ఎన్కౌంటర్ గా ప్రకటించిన ఈ సంఘటనపై అనేక అనుమానాస్పద పరిస్థితులు ఉన్నాయని, సోషల్ మీడియాలో కూడా పలు వీడియోలు, సమాచారం చర్చకు వస్తున్నాయని పేర్కొన్నారు.
మారేడుమిల్లి ఘటనలో పోలీసులు వాస్తవాలను వెల్లడించాలని, దానికి బాద్యులైన అధికారులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని, ముఖ్యంగా సుప్రీం కోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.
ఇటీవలి కాలంలో మావోయిస్టుల కార్యకలాపాలపై కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న ఆపరేషన్ కగార్ నేపథ్యంలో చత్తీస్గఢ్–దండకారణ్యం ప్రాంతాల్లో భద్రతా బలగాల మోహరింపు పెరిగిన నేపథ్యంలో పౌర హక్కుల సంఘాలు, మానవ హక్కుల సంస్థలు పునరావృతంగా పారదర్శకత కోరుతున్నాయి.
ఈ సమావేశంలో దళిత ప్రదర్శన సమితి రాష్ట్ర అధ్యక్షుడు బాకుర్ అశోక్, ప్రజా సంఘాల నాయకులు బాబూరావ్, రొమాల బాబు, జుట్టు రజినీకాంత్, రంగదాం భాను, ఆటపాక రాజు, లింగాల బాబు తదితరులు పాల్గొన్నారు.
