నర్సంపేట మండలంలోని శివాని గురుకుల పాఠశాలలో జిల్లాస్థాయి విద్య వైజ్ఞానిక ప్రదర్శన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. వరంగల్ జిల్లా వ్యాప్తంగా 13 మండలాల్లో ఉన్న పాఠశాలలు ఇందులో పాల్గొన్నారు. శాస్త్రపరిశోధనల వైపు విద్యార్థులను ప్రోత్సాహించేలా చేపడుతున్న ఈ కార్యక్రమం పట్ల సందర్శకులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
ఆకట్టుకున్న ఐఆర్ బేస్డ్ ట్రాఫిక్ డెన్సిటీ సిగ్నల్ అడ్జస్ట్మెంట్…
మనం నిత్యం ఎదుర్కొనే సమస్యల్లో ట్రాఫిక్ ఒకటి. పనుల నిమిత్తం బయటికి వెళ్లే జనాభా ఎక్కువ అవుతుండటంతో రోడ్లపై విపరీతమైన రద్దీ ఏర్పడి ట్రాఫిక్ సమస్య తీవ్రంగా మారుతోంది. ఢిల్లీ, హైదరాబాద్, బెంగళూరు లాంటి సిటీల్లో ఈ సమస్య నానాటికి పెరుగుతుండటం చూస్తుంటాం. ఈ సమస్యకు చెక్ పెట్టేలా బొల్లికుంట ప్రభుత్వ పాఠశాలకు చెందిన ఉపాధ్యాయుడు కృష్ణ గైడెన్స్ తో విద్యార్థిని నైసిక ప్రాజెక్ట్ ని వివరించారు. ట్రాఫిక్ డెన్సిటీని బట్టి ఎక్కువ ట్రాఫిక్ ఉంటే ఎక్కువ టైం ఉపయోగించడం, తక్కువ ట్రాఫిక్ ఉంటే తక్కువ టైం ఉపయోగించే విధంగా ప్రాజెక్ట్ చేసినట్లు తెలిపారు. ప్రస్తుతం ఇప్పుడున్న విధానంలో ఎక్కువ ట్రాఫిక్ ఉన్నా అదే టైము, తక్కువ ట్రాఫిక్ ఉన్నా అదే టైం ఉంటున్న సంగతి తెలిసిందే. ఈ ప్రాజెక్టు వల్ల తక్కువ ట్రాఫిక్కు ఉన్నప్పుడు తక్కువ టైం ఇవ్వడం, ఎక్కువ ట్రాఫిక్ ఉన్నప్పుడు ఎక్కువ టైం ఇవ్వడం వల్ల టైం ఆదా అవుతుందని తెలిపారు. ట్రాఫిక్ డెన్సీటీని తగ్గించడం వల్ల ప్రయాణీకులకు ఉపయోగకరంగా ఉండటమే కాకుండా ట్రాఫిక్ సిబ్బందికి సైతం సులభతరంగా ఉంటుందన్నారు. రవాణా వ్యవస్థ, వ్యవసాయం, ఆరోగ్యం, పరిశుభ్రత వంటి అవసరాలను సులభతరంగా తీర్చుకొనేందుకు పరిశోధనలు ఉపయోగపడతాయని ప్రాజెక్ట్ గైడ్ టీచర్ సీహెచ్ కృష్ణ వివరించారు.