గ్రామంలో నివాసముంటున్న మాకు సమాన హక్కులేదన్నట్లుగా మా వర్గానికి చెందిన మహిళ మృతదేహాన్ని స్మశాన వాటికలోనికి రానివ్వకపోవడం బాధాకరమని మర్కుక్ నాయి బ్రాహ్మణులు ఆవేదన వ్యక్తం చేశారు. మా కుటుంబాలకు న్యాయం జరిగేంత వరకు సవరాలు,శుభ,అశుభ కార్యక్రమాల్లో మా కుల వృత్తులను నిర్వహించబోమని ఆందోళన వ్యక్తం చేశారు.సిద్దిపేట జిల్లా మండల కేంద్రమైన మర్కుక్ లోని నాయి బ్రాహ్మణుల వర్గానికి చెందిన లింగంపల్లి ఎల్లమ్మ శుక్రవారం మృతి చెందిగా దహన సంస్కారాలు కోసం గ్రామంలో రెండు స్మశాన వాటికల్లోని ఆయా వర్గాలకు చెందిన వారు అనుమతించలేదు. చివరగా ఊరు శివారులో ఉన్న చెరువులో ఎల్లమ్మ మృత దేహాన్ని దహనం చేశారు. అయితే గ్రామంలోనే నివాసముంటున్న మాకు, సమాన హక్కుగా స్మశాన వాటికల్లోని ఎందుకు అనుమతించరంటూ నాయి బ్రాహ్మణులు ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా నాయి బ్రాహ్మణులు మాట్లాడుతూ హైదారాబాద్ వంటి పెద్ద పెద్ద నగరాల్లో సైతం చనిపోయిన వారందరికీ ఎలాంటి తారతమ్యాలు లేకుండా స్మశాన వాటికల్లో చివరి మజిలీ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని అలాంటిది మండల కేంద్రమైన మర్కుక్ లో ఇలా కులాల పేరిట దహన సంస్కారాలకు అనుమతించకుండా చనిపోయిన వారి కుటుంబాలకు ఇబ్బందులకు గురి చేయడం ఏంటని ఆవేదన వ్యక్తం చేశారు. అన్ని కులాలతో సమానంగా మా నాయి బ్రాహ్మణులకు సైతం దహన సంస్కరాలకు అడ్డుపడవద్దని వారన్నారు. ఈ విషయమై అధికారులు స్పందించి మాకు న్యాయం చేయాలని వారు కోరారు. ఇకనైనా ఇలాంటి కులవివక్షను వీడి అగ్రవర్ణలకు చెందిన వారు అన్ని కులాల వారితో సోదర భావంతో మేధిలితే బాగుంటుందని పేర్కొన్నారు.