తెలంగాణ రాష్ట్రంలో ప్రతి రెండు సంవత్సరాలకు ఒక సారి జరిగే యాదవుల(గొల్ల) చారిత్రక సాంస్కృతిక సంపదైన గొల్లగట్టు జాతర 16_02_2025 నుండి 20_02_2025 వరకు జరగనుంది.ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో సమ్మక్క సారక్క జాతర తరువాత జరిగే అతిపెద్ద జాతర గొల్లగట్టు. ఇదేకాకుండ సమ్మక్క సారలక్కతో పాటు గొల్లగట్టు లింగన్న పురాణాలు సృష్టించిన దేవతలు కాకుండ భూమిపై పుట్టిపెరిగి ఆరాధ్యులుగ నిలిచిన చారిత్రక మానవ మాత్యులు.తెలంగాణలో దైవాలుగ కొలువబడుతున్న బీరప్ప,మల్లన్న, వీరన్న,గొల్లగట్టు లింగన్నలు పశుకాపరులుగ జీవించిన చారిత్రక వీరులు.ముఖ్యంగా గొల్లగట్టు లింగమంతులను యాదవులే కాక అన్ని శ్రామిక ఉత్పత్తి కులాలు తమ ఇంటి దైవంగ కొలుచుకుంటారు.అయితే ఇప్పటివరకు భారతదేశంలో ఆధిపత్య దోపిడి వర్గాల చరిత్రే చరిత్రగ లిఖించబడింది కానీ శ్రామిక ఉత్పత్తి కులాల జీవనాలు చరిత్రకు ఎక్కలేదు.భిన్నంగా ఇప్పుడు మనం శ్రామికుల జీవనం,ఉత్పత్తి సాధనలు,ఉత్పత్తి విధానాలు,వారి సంస్కృతిని వాటి పరిస్థితులను మన చరిత్రగ రాసుకోవలసిన అవసరం ఉన్నది.
సూర్యాపేట జిల్లా కేంద్రానికి అతి సమీపంలో గొల్లగట్టు లింగమంతుల స్వామి జాతర మాఘమాసంలో అత్యంత వైభవంగ సాగుతుంది.ఈ జాతరకు తెలంగాణతో పాటు ఇతర రాష్ట్రల నుండి కూడ భక్తులు ‘ఓ లింగ’ అని లింగన్నను తలుచుకుంటు లక్షలాదిమందిగ తరలివస్తారు.ఇక్కడి స్థల చరిత్ర ప్రకారం లింగన్న మానవాతీత శక్తులు కలిగిన పశుకాపరిగా ఉంటూ ప్రకృతి వైపరీత్యాలనుండి కౄరమృగాల దాడుల నుండి పశువులని కాపాడే వాడని చెప్తుంటారు.స్థానిక పశుకాపరులు ఉండ్రుగొండ సమీపంలో ఉన్నటువంటి పెద్దగుట్టు మీద పశువులను మేపుతుండేవారు.ఆ సమయంలో పశువులపై దాడికి వచ్చిన కౄరమృగాలను ఎదుర్కుంటు వెళ్లిన లింగన్న మాయమై అక్కడే దైవంగా వెలిశాడని యాదవుల నమ్మకం.అలా మాయమైన లింగన్నను స్థానిక పశుకాపరులు ’ఓ లింగ’ అని తలుచంకుంటు పెద్దగుట్ట ఎక్కి జాతరను ప్రారంభించారు.ఉండ్రుగొండ పెద్దగుట్టు ప్రాంతం పెద్ద కోటదుర్గం,దట్టమైన అడవులతో నిండి ఉండడంతో పాటు జాతర సమయంలో ఒక గర్భిణికి జరిగిన ప్రమాదం కారణంగ ప్రస్థుతం దురాజ్‌పల్లి సమీపంలో ఉన్న పాలశెర్లయ్య గుట్టమీదికి జాతర మారినట్టు చెప్పుకుంటారు.దురాజ్‌పల్లి గ్రామానికి సమీపంలో ఉన్న కేసారం గ్రామ యాదవులు అక్కడ హక్కుదారులుగ ఉండి ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి జాతరను జరిపిస్తుంటారు.జాతరకు రెండు వారాల ముందు దిష్టిపూజ కొరకై తొర్రూరు సమీపాన చీకటాయిపాలెం నుండి గ్రామ బైకాని వారు దేవర పెట్టెను అత్యంత వైభవంగా కేసార గ్రామానికి తరలిస్తారు.దిష్టిపూజ రోజున ఆ గ్రామ యాదవులైన మెంతబోయిన,మున్న మరియు గోర్ల వంశీయులతో పూజలందంకున్న దేవర పెట్టెను ఆటాపాటలతో సాంప్రదాయ బేరీలు,గజ్జెలు,దుస్తువులను ధరించి గుట్ట మీదకు చేరుకుంటారు.దిష్టిపూజ పూర్తి అయిన రెండవ ఆదివారం రోజున ప్రారంభం అయిన జాతర సాంప్రదాయకంగ ఐదు రోజులు కొనసాగుతుంది.జాతర ప్రారంభానికి ముందే సూర్యపేటలోని హక్కుదారులైన యాదవ వంశస్తులు మకరతోరణాన్ని గొల్లగట్టుకు చేరుస్తారు.అదేవిధంగా కాసింపేట యాదవులు పసిడి కుండను జాతరకు ముందే చేర్చి లింగమంతుల స్వామి ఆలయంపై చివరి రోజు వరకు వుంచుతారు.ఈ ఐదు రోజుల పాటు జాతర యాదవుల సాంప్రదాయ వేషాధారన,బేరీలు,గజ్జెల లాగులు మందగంపల ప్రదర్శన,తడిబట్ట తానాలు,ఒకపొద్దు బోనాలు,కఠార్ల ప్రదర్శన,చంద్ర పట్నం,గండ దీపం,గదా శూలం,జాగిలాల ఆటలతో అంగరంగ వైభవంగ జరుగుతుంది….
*★యలమంచలి గంగమ్మ,ఆగుమంచి*
లింగమంతుల జాతరలో లింగన్న,మాణిక్యమ్మ,చౌడమ్మలతో పాటుగ యలమంచలి గంగమ్మ యాదవ రాజ్యం చివరి పాలకురాలైన ఆగుమంచిలు పూజలందుకుంటారు.కాటమరాజు పూర్వికులైన వలురాజు,పెద్దిరాజు(కాటమరాజు తండ్రి),పోలురాజులు విశాఖపట్నం సమీపంలో ఉన్న యలమంచలి కేంద్రంగా రాజ్యాన్ని పరిపాలించారు.తరువాత కాలంలో అయితమరాజు (పోలురాజు కుమారుడు) ప్రస్తుత ఖమ్మం జిల్లా పాలేరు సమీపంలోని ఉర్లుకొండ కేంద్రంగ మరో రాజ్యాన్ని స్థాపించాడు.దీనిని తమ పూర్వికులు పరిపాలించిన యలమంచలి పేరుతో పిలుసుకున్నారు.ఈ ఉర్లుకొండ యలమంచలి గొల్లగట్టుకు 25 కిలోమీటర్ల దూరంలో ఉన్నది.కాటమరాజు పట్టాభిషేకం కూడ ఉర్లుకొండ యలమంచిలోనె జరిగినట్టు కనకబండి మోహన్‌రావు పేర్కొన్నారు..అంతేకాదు అయితమరాజు,కరియావుల రాజులు ఓరుగల్లు బేతాలుడుతో యుద్ధం చేసినప్పుడు ఉర్లుకొండ యలమంచలి నుండే వెళ్ళినట్టు తన పరిశోధనలో తెలిపారు.ఇప్పటికీ దీని చుట్టుపక్కల యలమంచలి గంగమ్మ జాతరలు జరుగుతుండడం గమనార్హం.ఇందులో భాగంగానే గొల్లగట్టుపై చౌడమ్మ ఆలయంలో యలమంచలి గంగమ్మ పూజలందుకుంటుదని యాదవుల నమ్మకం.
యాదవ మహారాణి ఆగుమంచి పోలురాజు సిరిదేవిల కూతురు.అన్న కాటమరాజు పిలుపు మేరకు అయితమరాజు యర్రగడ్డపాడు యుద్ధానికి వెలుతున్న సమయంలో దొనకొండ రాజ్యాన్ని సోదరి ఆగుమంచి చేతిలో పెట్టినట్టు తెలుస్తున్నది.తల్లి సిరిదేవి,వదిన వీరగంగ(కాటమరాజు బార్య) సహాయంతో ఆగుమంచి దొనకొండ రాజ్యాన్నేలింది.ఆగుమంచి రాజ్యమేలినట్టుగ గంగదొనకొండలో ఉన్న ఆగుమంచి బావి,ఆగుమంచి పాదాలు,సతీసహగమన ఛాయా చిత్రాలు సజీవ సాక్ష్యాలు.యాదవ రాణి ఆగుమంచి అత్యంత ధైర్యసాహసురాలు, సౌందర్యవతి కూడ.యర్రగడ్డపాడు యుద్ధంలో అన్నలకు విజయం కలగాలని ఆగుమంచి శివపూజలు చేసింది.యాదవ కాంతల చేత యలమంచలిగంగ బోనాలు చేయించింది,గంగకు పాలు పోస్తుంటె అవి ఎర్రని రక్తంగ మారడం యర్రగడ్డపాడు యుద్ధంలో అన్నలకు ఆపద సూచికగా భావించింది.యుద్ధంలో యాదవ వీరులు, సైన్యాలు ఆగుమంచి భర్త పుత్తమరాజు(కొమరమ్మ కుమారుడు) వీర మరణం పోందారని తెలిసిన తరువాత తమకున్న సిరి,సంపదలను రాజ్యంలోని ప్రజలకు పంచిపెట్టింది.తమ వంశ కీర్తిని నలుమూలల చాటడానికి యాదవ ఆశ్రిత కులాలను సృష్టించి చివరకు ఆగుమంచి యాదవ రాణులతో పాటుగా సతీసహగమనం చేసుకునట్టు తెలుస్తన్నది.ఒకవైపు లింగన్న ఉత్పత్తి శక్తిగ మరోవైపు పశుకాపరులుగ మరియు రాజ్యపరిపాలకులుగ ఉన్న కాటమరాజు వంశస్తులైన యాదవ వీరులు ఒకేదగ్గర పూజలందుకోవడం ఈ గొల్లగట్టు జాతర ప్రత్యేకం.
ఇంతటి వైవిధ్యం కలిగిన జాతరను ప్రభుత్వం రాష్ట్ర పండుగుగ గుర్తించాల్సిన అవసరం ఉన్నది.జాతరకు లక్షలాది మంది భక్తులు హాజరవుతున్నప్పటికి ప్రభుత్వం వసతులపైన సరైన దృష్టి పెట్టకుండ తాత్కాలిక ఏర్పాట్లకు పరిపితమవుతుంది.రాష్ట్రంలో రెండవ పెద్ద జాతర అయిన గొల్లగట్టుకు ప్రభుత్వం కేవలం ఐదు కోట్లు కెటాయించడం యాదవులను విస్మరించడమే.వెంటనే ప్రభుత్వం జాతరకు అధిక నిధులు కెటాయించి,శాశ్వత వసతులను కల్పించాలి.