కాకినాడ : భోగిగణపతి పీఠం నుండి 14 ఏళ్లుగా భద్రాచల పాదయాత్ర రథయాత్ర చేస్తున్న గొంచాల ఉత్సవ కమిటీ రూ.12లక్షల ప్రత్యేక నిధులు సేకరించి జాతీయ రహదారిని ఆనుకుని వున్న గొంచాల గ్రామంలో రామాలయాన్ని నూతనంగా నిర్మించింది. మార్చి 3న పరివార దేవత నూతన ఆలయ విగ్రహ ప్రతిష్టాపన చేపట్టిన సందర్భంగా శుక్రవారం సాయంత్రం ఆహ్వాన శుభపత్రికను గణపతి పీఠంలో పంచదారతో తయారు చేసిన శ్రీకాళహస్తీశ్వరుని పటిక శివలింగం వద్ద మూడు రోజులుగా జరుగుతున్న ప్రత్యేక పూజల్లో వుంచి ఆవిష్కరించారు. పీఠం ఉపాసకులు దూసర్లపూడి రమణరాజు మాట్లాడుతూ స్వయంభూ భోగి గణపతి అనుగ్రహంతో 2012లో చేపట్టిన పాదయాత్రలను కొనసాగిస్తూ భద్రాద్రి రామాలయాలు నిర్మించడం పట్ల శుభాశీస్సులు తెలిపారు. పాదయాత్ర ఆలయ నిర్మాణ ఉత్సవ కమిటీ అధ్యక్షుడు పేర్నీడి వెంకటరమణ మాట్లాడుతూ పాదయాత్రికుల గురుస్వామి వాసుదేవ దీక్షితులు ఆధ్వర్యంలో ప్రతిష్టాపనమహోత్సవం జరుగుతున్నదని తెలిపారు.
