పిఠాపురం : నియోజకవర్గంలోని గొల్లప్రోలు మండలం చేబ్రోలు పిఠాపురం ఎమ్మెల్యే, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొణిదల పవన్ కళ్యాణ్ నివాసంలో జనసేన పార్టీ కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఇంచార్జ్ మర్రెడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ ఈ నెల 14వ తేదీన జరగబోయే జనసేన పార్టీ 12వ ఆవిర్భావ దినోత్సవం విజయవంతం చేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఆవిర్భావ సభకు పిఠాపురం నియోజవర్గ పరిశీలకులుగా దాసరి రాజు, పి.ఎన్.రాజులను జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ నియమించినట్లు ఇంచార్జ్ మర్రెడ్డి శ్రీనివాస్ తెలియజేశారు. ఈ సందర్భంగా దాసరి రాజు మాట్లాడుతూ గ్రామాల వారిగా సమావేశాలు నిర్వహించి జనసేన పార్టీ అధికారం చేపట్టిన తర్వాత జరుపుకునే మొదటి పండుగను ఘనంగా జరుపుకోవాలని తెలియజేశారు. చోడవరం ఇంచార్జ్ పి.ఎన్.రాజు మాట్లాడుతూ ఆవిర్భావ సభను విజయవంతం చేసేందుకు ఇప్పటికే కమిటీలు నియమించడం జరిగిందని, ఈ కమిటీలతో పాటు ఆహ్వాన కమిటీని కూడా ఏర్పాటు చేశామని, మీరందరూ సమన్వయంతో పనిచేసి ఆవిర్భావ సభను విజయవంతం చేయాలని ఇతర జిల్లాల నుంచి రాష్ట్రాల నుంచి వచ్చే ప్రతి ఒక్క జనసేన పార్టీ నాయకులకు పవన్ కళ్యాణ్ అభిమానులకు ఘన స్వాగతం పలికి ఆతిథ్యాన్ని అందించాలని ఆయన కోరారు. అనంతరం ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా నుంచి కూటమి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా పేరాబత్తుల రాజశేఖరం పోటీ చేసి 1,24,702 (62.59%) ఓట్లు సాధించి, 77,421 ఓట్ల భారీ మెజారిటీతో అఖండ విజయం సాధించడంతో చేబ్రోలు జనసేన పార్టీ అధ్యక్షుడు, పిఠాపురం ఎమ్మెల్యే, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొణిదల పవన్ కళ్యాణ్ నివాసంలో జనసేన పార్టీ నాయకులు, అభిమానులు, కార్యకర్తలు సంబరాలు జరుపుకున్నారు. జనసేన పార్టీ పిఠాపురం నియోజకవర్గం ఇంచార్జ్ మర్రెడ్డి శ్రీనివాస్ మరియు ఆవిర్భావ సభకు పిఠాపురం నియోజవర్గ పరిశీలకులుగా నియమించిన దాసరి రాజు, పి.ఎన్.రాజు తదితరులు భారీ కేక్ కట్ చేసి అందరికీ పంచారు. భారీ ఎత్తున బాణాసంచా కాల్చి అభిమానులు ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఇన్చార్జ్ మర్రెడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ పేరాబత్తుల రాజశేఖరం గెలుపుకు కృషి చేసిన ప్రతీ ఒక్క జనసేన నాయకుడికి, కూటమి నాయకులకు, అభిమానులకు, కార్యకర్తలకు ధన్యవాదాలు తెలియజేశారు.