పిఠాపురం : మద్యపాన వ్యతిరేక ప్రచార కమిటీ, ప్రజాసంఘాల ఆధ్వర్యంలో బుధవారం మధ్యాహ్నం పిఠాపురం మండలం మంగితుర్తి గ్రామంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో తెలంగాణ సాయుధ రైతాంగ విప్లవ పోరాటంలో కీలక పాత్ర పోషించిన వీరవనిత మల్లు స్వరాజ్యం మూడవ వర్ధంతి ఘనంగా నిర్వహించారు. తొలుత ఆమె చిత్రపటానికి పూలమాలతో ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మద్యపాన వ్యతిరేక ప్రచార కమిటీ జిల్లా కన్వీనర్ ఎన్.సూర్యనారాయణ మాట్లాడుతూ ఉమ్మడి నల్లగొండ జిల్లా తుంగతుర్తి మండలం కరివిరాల కొత్తగూడెంలో భూస్వామ్య కుటుంబంలో 1931 సంవత్సరం మల్లు స్వరాజ్యం జన్మించారని అన్నారు. చిన్నతనంలోనే కమ్యూనిస్టు భావాలు అలవర్చుకొని దోపిడికి వ్యతిరేకంగా తన సొంత గ్రామంలోని పెత్తందారుని ఎదిరించి కూలి రేట్ల ఉద్యమం ప్రారంభించి రాష్ట్ర వ్యాప్తంగా అనేక ఉద్యమాలు, ముఖ్యంగా మహిళలు ఎదుర్కొంటున్న మద్యపానం( సారా) వ్యతిరేకంగా మహిళలను కూడగట్టి రాష్ట్ర వ్యాప్త ఉద్యమాలు నిర్వహించారని అన్నారు. 1945 – 48 సంవత్సరంలో సాగిన విరోచిత రైతాంగ పోరాటంలో కీలక పాత్ర పోషించి నైజాం సర్కార్ను ఎదిరించి 10 లక్షల ఎకరాలు పేదలకు భూ పంపిణీ చేశారని అన్నారు. భూస్వామ్య కుటుంబం నుండి వచ్చినప్పటికీ అణగారిన వర్గాల్లోకి, వ్యవసాయ కార్మికుల్లోకి చచ్చుకొనిపోయి వారిలో ఒకరిగా ప్రజలతో మేమేకమైయ్యే లక్షణం కలిగి ఉన్న స్వరాజ్యం జీవితాంతం పేదల అభ్యున్నతికే తపించారని అన్నారు. ఆమె జీవితం నేటితరానికి ఆదర్శం గా తీసుకొని ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై పోరాడాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కెవిపిఎస్ జిల్లా కార్యదర్శి కే.సింహాచలం, మద్యపాన వ్యతిరేక ప్రచార కమిటీ నాయకులు గుర్రాల ప్రసాద్, వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు మామిడి ఏసుబాబు, డెక్కల లాజరు, మహిళలు వై.అన్నవరం, అచ్చియమ్మ, ఎం నాగమణి తదితరులు పాల్గొన్నారు.

previous post
next post